Rashid Khan : శుక్రవారం పుట్టినరోజు జరుపుకున్న ఈ ఆఫ్గనిస్తాన్ ఆటగాడు దక్షిణాఫ్రికా జట్టుపై పెను సంచలనాలను నమోదు చేశాడు. ఇతడి ధాటికి సౌత్ ఆఫ్రికా జట్టు వణికిపోయింది. టాప్ ఆర్డర్ పేక మేడలాగా కూలిపోయింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టుపై 2-0 తేడాతో ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ దక్కించుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే విజేతగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. అలాంటి జట్టును ఆఫ్ఘనిస్తాన్ మట్టికరిపించింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆల్రౌండర్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది.. సౌత్ ఆఫ్రికా జట్టుపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. ఇక పరుగులపరంగా చూసుకుంటే ఆఫ్గనిస్తాన్ జట్టుకు ఇది అత్యంత భారీ విజయం. దక్షిణాఫ్రికా జట్టుకు ఐదవ అతిపెద్ద ఓటమి.
భారీ స్కోర్ చేశారు
ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్ల పాటు పూర్తిస్థాయిలో ఆడింది. నాలుగు వికెట్లు నష్టపోయి 311 పరుగులు చేసింది. గుర్భాజ్ 105, అజ్మతుల్లా 86, రహమత్ 50 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్ ను భారీ స్కోర్ కు బాటలు వేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు ఎంగిడి, మార్క్రమ్, పీటర్, బర్గర్ తలా ఒక వికెట్ సొంతం చేసుకున్నారు.
134 పరుగులకే..
అనంతరం 312 పరుగుల విజయ లక్ష్యం తో సౌత్ ఆఫ్రికా రంగంలోకి దిగింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ 34.2 ఓవర్లలో 134 రన్స్ కే చాప చుట్టింది. కెప్టెన్ బవుమా 38 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ (5/19) ఐదు వికెట్లు పడగొట్టాడు. ఖరోటె (4/26) నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఈ దశలో రషీద్ ఖాన్ అద్భుతమైన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. వన్డే చరిత్రలో తన పుట్టినరోజున ఐదు వికెట్లు సొంతం చేసుకున్న తొలి ఆటగాడిగా.. అత్యధికంగా వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డును సృష్టించాడు. పుట్టినరోజు సందర్భంగా అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాలలో దక్షిణాఫ్రికా బౌలర్ ఫిలాండర్, సువర్ట్ బ్రాడ్ ఉన్నారు. 2007లో ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఫిలాండర్ 4/12, 2010లో ఆస్ట్రేలియా జట్టుపై స్టువర్ట్ బ్రాడ్ 4/44 వికెట్లు సొంతం చేసుకున్నారు. రషీద్ ఖాన్ సంచలన బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి కాదు.. టెస్ట్ క్రికెట్ ఆడే అన్ని జట్లపై అతడు అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. దీంతో అతడు మోస్ట్ వాంటెడ్ బౌలర్ గా రూపాంతరం చెందాడు.