SA VS AFG : మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ దక్షిణాఫ్రికా జట్టుతో షార్జా వేదికగా తలపడుతోంది. ఇందులో భాగంగా తొలి వన్డేలో విజయం సాధించింది. రెండవ వన్డే లోనూ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఫలితంగా సిరీస్ 2-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండవ వన్డే మ్యాచ్ లో 177 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తొలిసారిగా సౌత్ ఆఫ్రికా పై ద్వైపాక్షిక సిరీస్ ను దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లకు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 311 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుర్బాజ్ 105 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అజ్మతుల్లా 50 బంతుల్లో 86 పరుగులు చేశాడు. రహమత్ 66 బంతుల్లో 50 పరుగులు చేసి అలరించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, మార్క్రం, పీటర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు శుభారంబాన్ని చేసింది. ఓపెనర్ రియాజ్ హసన్ (45 బంతుల్లో 29)తో కలిసి మరో ఓపెనర్ గుర్బాజ్ తొలి వికెట్ కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రియాజ్ ఔట్ అయినప్పటికీ రహమత్ తో కలిసి గుర్బాజ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వన్డేలలో ఏడవ సెంచరీ సాధించాడు. సెంచరీ చేసిన కొంత సమయానికి అతడు ఔటయ్యాడు. అనంతరం ఆజ్మతుల్లా క్రీజ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత ఒకసారిగా ఆఫ్గనిస్తాన్ పరిస్థితి మారిపోయింది. అతడు బౌండరీలు, సిక్సర్లు కొట్టి స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టించాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 300+ కు చేరుకుంది.
బెంబేలెత్తిన దక్షిణాఫ్రికా
312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 34.2 ఓవర్లలో 134 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. బర్త్ డే హీరో రషీద్ 5/19, ఖరోటె 4/26 సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ ను బెంబేలెత్తించారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా 38 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ఆటగాడు టోనీ 44 బంతుల్లో 31, మార్క్రమ్ 31 బంతుల్లో 21, రీజా హెండ్రిక్స్ 34 బంతుల్లో 17 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు పెద్దగా సత్తా చాట లేకపోవడంతో సౌత్ ఆఫ్రికా 177 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 34.2 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా కేవలం 134 పరుగులకే కుప్పకూలడంతో ఆ జట్టు అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఆటగాళ్ల బ్యాటింగ్ శైలి పై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అనామక జట్టుపై ఇలా ఆడుతున్నారేంటని మండిపడుతున్నారు. జట్టు పరువు తీశారని విమర్శలు చేస్తున్నారు.