Patidar sacrifice IPL : క్రికెట్ విషయానికొస్తే చాలామంది ఆటగాళ్లు ఆ క్రీడకు సమున్నత గౌరవం తీసుకొచ్చారు. ఇక ఇప్పటి కాలంలో చాలామంది క్రికెటర్లు క్రికెట్ గౌరవాన్ని మరింత పెంచారు. ఆ పెంచే క్రతువులో గొప్ప పనులు చేశారు. అలాంటి గొప్ప పనులు చేసిన క్రికెటర్ జాబితాలో బెంగళూరు సారధి రజత్ కూడా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి తీరని కోరికగా.. నెరవేరని ఆశయంగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని ఆ జట్టు చెంత చేర్చాడు రజత్. వాస్తవానికి లెజెండరీ ప్లేయర్లు అనిల్ కుంబ్లే, డివిలియర్స్, గేల్, విరాట్ వంటి సారధుల వల్ల సాధ్యం కాని చరిత్రను, అరి వీర భయంకరమైన ప్లేయర్ల వల్ల కూడా కానీ ఘనతను అతడు కళ్ళ ముందు ఉంచాడు. దీంతో అతడు ఒకసారిగా కన్నడ ప్రజలకు ఆరాధ్య సారధిగా మారిపోయాడు. ఎప్పుడైతే కన్నడ జట్టు ట్రోఫీ అందుకుందో.. అప్పటినుంచి రజత్ కు సంబంధించిన ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో నానుతోంది.
ఐపీఎల్ కోసం రజత్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. 2021లో అతడు సరిగ్గా ప్రతిభ చూపించడం లేదని ఆ మరుసటి సీజన్లో కన్నడ జట్టు యాజమాన్యం పక్కన పెట్టింది. అయితే వేరే ఆటగాడు గాయం బారిన పడటంతో.. అనూహ్యంగా రజత్ ను ఆ ప్లేయర్ కు ప్లేస్మెంట్ గా తీసుకుంది. అదే సమయంలో అతని వివాహం ఉండగా.. అత్యంత ఇష్టమైన క్రికెట్ మీద ప్రేమ ఉండడంతో రజత్ వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. అనంతరం కసికొద్ది ప్రాక్టీస్ చేశాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టడాన్ని నేర్చుకున్నాడు. వైవిధ్యభరితమైన బంతులను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ తీసుకున్నాడు. మొత్తంగా కన్నడ జట్టులో కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు.. ఇక దేశవాలి క్రికెట్లో మధ్యప్రదేశ్ జట్టుకు సారధిగా వ్యవహరించాడు. ఆ జట్టు సాధించిన విజయాలలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాడు. అనంతరం అదే ఊపులో కన్నడ జట్టుకు సారథిగా మారిపోయాడు.
విరాట్, సాల్ట్ వంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ.. రజత్ వైపు కన్నడ యాజమాన్యం ఆసక్తి చూపించింది. దేశవాళిలో అతడు గొప్పగా ఆట తీరు ప్రదర్శించడం.. అది కన్నడ యాజమాన్యానికి నచ్చడంతో.. అతడి సారధ్యానికి ఓకే చెప్పింది. అంతిమంగా అతడు సారధిగా కన్నడ జట్టు రూపురేఖలు మార్చి పడేశాడు. మంచి మంచి ప్లేయర్లను ఎంచుకొని.. జట్టు అవసరాలకు సరిపడే విధంగా వారిని మార్చుకున్నాడు. బౌలింగ్లో పటిష్టం చేశాడు. బ్యాటింగ్లో దృఢత్వం నింపాడు. ఫీల్డింగ్ లో స్థిరత్వం నింపాడు. మొత్తంగా కన్నడ జట్టును సిసలైన ఛాంపియన్ గా నిలిపాడు. ఇప్పుడు కన్నడ అభిమానుల ద్వారా ప్రశంసలు అందుకుంటున్నాడు.