Rajasthan Pink Promise: 78 ఇళ్ళకు సోలార్ వెలుగులు

రాజస్థాన్ రాష్ట్రం పూర్తి ఎడారి ప్రాంతం. అతిపెద్ద రాష్ట్రం కావడంతో.. ఇక్కడ మారుమూల గ్రామాలు చాలా ఎక్కువ. తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొనే ఈ రాష్ట్రంలో థర్మల్ పవర్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ రాష్ట్రానికి విద్యుత్ అవసరాలు గాలి మరల ద్వారానే తీరుతాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : April 7, 2024 11:31 am

Rajasthan Pink Promise

Follow us on

Rajasthan Pink Promise: బెంగళూరు తో జరిగే మ్యాచ్ లో పూర్తి పింక్ కలర్ జెర్సీతో కనిపించిన రాజస్థాన్ ఆటగాళ్లు.. పింక్ ప్రామిస్ అనే కాన్సెప్ట్ తో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. పేద మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు.. పేదల ఇళ్లల్లో వెలుగులు నింపేందుకు పింక్ ప్రామిస్ ను తెరపైకి తీసుకొచ్చారు. బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో ఒక్క సిక్స్ నమోదయితే.. ఆరు ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం నాటి మ్యాచ్లో 13 సిక్స్ లు నమోదయ్యాయి. ఈ ప్రకారం 78 ఇళ్లపై ఉచితంగా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు కానున్నాయి. బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం.. రాజస్థాన్ కెప్టెన్ సంజు సాంసన్ చేతుల మీదుగా రాజస్థాన్ రాయల్స్ టీం మేనేజ్మెంట్, రాజస్థాన్ ఫౌండేషన్ బాధ్యులు ఓ మహిళకు సోలార్ ప్యానల్ అందించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రాజస్థాన్ రాష్ట్రం పూర్తి ఎడారి ప్రాంతం. అతిపెద్ద రాష్ట్రం కావడంతో.. ఇక్కడ మారుమూల గ్రామాలు చాలా ఎక్కువ. తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొనే ఈ రాష్ట్రంలో థర్మల్ పవర్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ రాష్ట్రానికి విద్యుత్ అవసరాలు గాలి మరల ద్వారానే తీరుతాయి.. ఆ రాష్ట్రంలో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి.. అక్కడి మారుమూల గ్రామాల మహిళలకు సోలార్ ప్యానల్స్ అందించే కార్యక్రమానికి రాజస్థాన్ జట్టు, రాజస్థాన్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టాయి. ఇలా బెంగళూరు తో జరిగే మ్యాచ్లో ఒక్కో సిక్స్ కు ఆరు ఇళ్లకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తామని రాజస్థాన్ జట్టు ప్రకటించింది. ప్రకటించిన విధంగానే సోలార్ ప్యానల్స్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. శనివారం నాటి మ్యాచ్లో 13 సిక్స్ లు నమోదయ్యాయి. ఒక్కో సిక్స్ తో ఆరు ఇళ్లకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తామని రాజస్థాన్ జట్టు ప్రకటించిన నేపథ్యంలో.. మొత్తం 78 గృహాలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సోలార్ ప్యానల్స్ వల్ల పేదల ఇళ్లల్లో విద్యుత్ వెలుగులు ప్రసరించనున్నాయి. కేవలం సోలార్ ప్యానల్స్ మాత్రమే కాకుండా.. పింక్ ప్రామిస్ పేరుతో పేద మహిళల ఆర్థిక స్థిరత్వానికి రాజస్థాన్ జట్టు బాటలు వేయనుంది.

ప్రత్యేకంగా రూపొందించిన పింకీ జెర్సీలను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులో కొంత పేద మహిళల కోసం వెచ్చిస్తారు. మ్యాచ్ టికెట్లను విక్రయించగా.. ఒక్కో టికెట్ పై వంద రూపాయల వరకు విరాళంగా ప్రకటిస్తారు. ఈ మొత్తం డబ్బులను పేద మహిళల ఆర్థిక ఉన్నతికి ఉపయోగిస్తారు. వారి స్వయం ఉపాధికి ద్వారాలు తెరుస్తారు. ఐపీఎల్ అంటే డబ్బుతో కూడుకున్న ఆట మాత్రమే కాదని.. అందులోనూ సేవాగుణం ఉందని రాజస్థాన్ రాయల్స్ జట్టు నిరూపిస్తోంది. పింక్ ప్రామిస్ ద్వారా తమ రాష్ట్రంలోని మహిళలకు ఉడుతా భక్తిగా చేయూతనందిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ చేస్తున్న ఈ ప్రయత్నం పట్ల నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. అన్నట్టు శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు మూడు వికెట్లకు 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం చేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. రాజస్థాన్ ఆటగాడు బట్లర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.