https://oktelugu.com/

Rahul Dravid : సచిన్.. వినోద్ కాంబ్లీ.. మంచి క్రికెటర్ కు టాలెంట్ మాత్రమే కాదు.. అది కూడా ఉండాలి.. రాహుల్ ద్రావిడ్ సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడే కాదు.. అతడు ఆడుతున్నప్పుడు కూడా రాహుల్ ద్రావిడ్ మిస్టర్ సైలెంట్. మిస్టర్ వాల్ గా పేరుపొందిన అతడు.. తన కెరియర్ చివరి వరకు నిశ్శబ్ద ఆటగాడి గానే ఉన్నాడు. వివాదాలలో తలదూర్చకపోవడం.. సమయమనం పాటించడం.. జట్టుకు పెట్టని కోట లాగా ఉండడం రాహుల్ ద్రావిడ్ కే చెల్లింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 5, 2024 / 07:25 PM IST

    Rahul Dravid

    Follow us on

    Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ టెస్ట్ మాత్రమే కాదు వన్డేల లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా.. ఎక్కడా ఇతర ఆటగాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఇన్నింగ్స్ ఆడాడు. అందువల్లే అతడిని టీమిండియా వాల్ అని పిలుస్తారు. జాతీయ జట్టు నుంచి నిష్క్రమించిన తర్వాత టీమ్ ఇండియాకు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరించాడు. అతడి ఆధ్వర్యంలోనే టీమిండియా ఇటీవల టీ20 వరల్డ్ కప్ సాధించింది. టి20 వరల్డ్ కప్ సాధించినప్పటికీ అతడు టీమిండియా కోచ్ గా ఉండాలనుకోలేదు. రోహిత్ శర్మ బతిమిలాడినప్పటికీ సున్నితంగా తోసిపుచ్చాడు. ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే సీజన్ కు జట్టును బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ ద్రావిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఒక క్రికెటర్ కు ఎలాంటి లక్షణాలు ఉండాలో సోదాహరణంగా వివరించాడు. ఇంతకీ రాహుల్ ద్రావిడ్ ఏమన్నాడంటే.. ” ప్రతిభ ఉన్నప్పటికీ ఆటగాళ్లు కొన్ని లక్షణాలను అలవర్చుకోవాలి. ఇతర అంశాలను కూడా అందిపుచ్చుకోవాలి. వాటిల్లో వెనుక పడితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకు బలమైన ఉదాహరణ వినోద్ కాంబ్లీ. అతని పేరు చెప్పడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తప్పడం లేదు. రాజ్ కోట్ వేదికగా జరిగిన ఓ మ్యాచ్లో శ్రీనాథ్, అనిల్ కుంబ్లే బౌలింగ్ లో వినోద్ కాంబ్లీ 150 కి పైగా పరుగులు చేశాడు. అనిల్ కుంబ్లే బౌలింగ్ లో ఓ బంతిని నేరుగా ఉన్న గోడకు బలంగా కొట్టాడు. అతడు కొట్టిన తీరుకు మేమంతా ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాం. అలాంటి ఆటగాడు ఇప్పుడు ఇలా అయిపోయాడు. ఆట మాత్రమే కాదు.. ఇతర అంశాల్లో క్రికెటర్లు వెనుకబడిపోతే ఎలా జరుగుతుందో దానికి వినోద్ కాంబ్లీ జీవితమే ఒక ఉదాహరణ. సచిన్, వినోద్ కాంబ్లీ ఒకేసారి కెరీర్ మొదలుపెట్టారు. సచిన్ ఆట మాత్రమే కాదు, ఇతర విషయాల్లో పట్టు సాధించాడు. అత్యధిక ఒత్తిడి ఉండే అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటాడు. అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. అందువల్లే టాలెంట్ ఒక్కదానితోనే ఆటగాళ్లను జడ్జి చేయకూడదని” రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించాడు.

    అవి కూడా ఉండాలి

    “బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. గొప్ప ఆటగాడు కావాలంటే చాలా ఉండాలి. నిబద్ధత ఉండాలి. క్రమశిక్షణ ఉండాలి. సాధించాలనే తపన ఉండాలి. జట్టు కోసం ఆడే విధానంలో కసి ఉండాలి. దూకుడు ప్రదర్శించాలి. ప్రత్యర్థి ఆటగాళ్లపై పరాక్రమాన్ని చూపించాలి. అప్పుడే ఆ ఆటగాడు నిల దొక్కుకోగలడు. లేకుంటే ఇబ్బంది పడక తప్పదు. సచిన్ అద్భుతమైన ఆట ఆడుతాడు. అతడిలో ఎన్నో విశేషణాలు ఉన్నాయి. సెహ్వాగ్ బంతి గమనాన్ని సరిగ్గా అంచనా వేస్తాడు. గౌతమ్ గంభీర్ కూడా మెరుగ బ్యాటింగ్ చేస్తాడు. గంగోలి అద్భుతమైన కవర్ డ్రైవ్ లు ఆడతాడు. వీరందరికీ అంచనాలకు మించిన టాలెంట్ ఉంది. అందువల్లే వారు ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించారని” రాహుల్ వివరించాడు. ఇటీవల ముంబైలో రమాకాంత్ అచ్రేకర్ స్మారకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సచిన్, వినోద్ కాంబ్లీ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. సచిన్ ను వినోద్ కాంబ్లీ గుర్తుపట్టలేదు. ఆ తర్వాత సచిన్ వినోద్ వద్దకు వెళ్లి చాలాసేపు మాట్లాడిన తర్వాత గుర్తుపట్టాడు. అతడిని ఆలింగనం చేసుకున్నాడు.. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో కలకలం సృష్టించగా.. ఇది జరిగిన మరుసటిరోజే రాహుల్ ద్రావిడ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.