India Vs England Semi Final 2024: టి20 వరల్డ్ కప్ లో భాగంగా గయానా వేదికగా గురువారం టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ మ్యాచ్ ఆడబోతున్నాయి. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. తొలి సెమీస్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ఇంగ్లాండ్ – టీమిండియా మధ్య జరిగే మ్యాచ్ పైనే ఉన్నాయి.
ఐసీసీ t20 ర్యాంకింగ్స్ ప్రకారం చూసుకుంటే.. టీమిండియా మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లాండ్ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో వరుస విజయాలతో భారత్ సెమీస్ చేరుకుంది. ఇంగ్లాండ్ పడుతూ లేస్తూ ప్రయాణం సాగించింది. సూపర్ -8 పోరులో వెస్టిండీస్, అమెరికాపై గెలిచిన ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఇక టీమిండియా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాపై గెలిచి.. గ్రూప్ -1 లో టేబుల్ టాపర్ గా నిలిచింది.
ఇప్పటివరకు ఇంగ్లాండ్ – టీమిండియా మధ్య 23 t20 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 12 మ్యాచ్ లను టీమిండియా నెగ్గింది. 11 మ్యాచ్లలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఈ రెండు జట్లు పరస్పరం తలపడిన గత 5 t20 మ్యాచ్లలో.. మూడు టీమిండియా, రెండు ఇంగ్లాండ్ నెగ్గాయి. ఈ రెండు జట్లు నవంబర్ 10, 2022 తర్వాత పరస్పరం తలపడటం ఇదే తొలిసారి.. 2022 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ మ్యాచ్లో భారత జట్టును ఇంగ్లాండు పది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఇంగ్లాండ్ ను 100 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. అయితే గురువారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని టీమ్ ఇండియా భావిస్తోంది.
ఇక గూగుల్ అంచనా ప్రకారం గురువారం జరిగే రెండవ సెమీఫైనల్ మ్యాచ్లో రోహిత్ నాయకత్వంలోని టీమిండియా గెలిచేందుకు 58 శాతం అవకాశం ఉంది. బట్లర్ ఆధ్వర్యంలోని ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించేందుకు 42 శాతం అవకాశం ఉంది. గయానా మైదానంపై 34 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు జరిగాయి. ఈ మైదానం పై ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 16 సార్లు విజయాన్ని దక్కించుకుంది. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు 14 సార్లు గెలుపును సొంతం చేసుకుంది.. 2022 t20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ మ్యాచ్లో భారత జట్టును ఇంగ్లాండ్ ఓడించిన నేపథ్యంలో.. గురువారం జరగబోయే మ్యాచ్లో రోహిత్ సేన ఏ స్థాయిలో ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.