Ravichandran Ashwin: మూడో టెస్టులో టీమిండియా కు ఎదురుదెబ్బ.. అర్ధాంతరంగా వెళ్ళిపోయిన అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్ తల్లి కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం అంత బాగా లేకపోవడం.. ఈ సమయంలో పక్కన ఉండాల్సి రావడంతో రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా రాజ్ కోట్ మైదానాన్ని వీడాడు అని బీసీ సీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ట్విట్టర్ ఎక్స్ లో ప్రకటించారు.

Written By: Suresh, Updated On : February 17, 2024 10:05 am
Follow us on

Ravichandran Ashwin: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. భారత ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా రాజ్ కోట్ నుంచి శుక్రవారం రాత్రి చెన్నై వెళ్ళిపోయారు. దీంతో ఒక్కసారిగా జట్టులో కలకలం నెలకొంది. “కుటుంబంలో నెలకొన్న ఆరోగ్యపరమైన అత్యయిక పరిస్థితి వల్ల అతడు చెన్నై వెళ్ళిపోవాల్సి వచ్చింద” ని బీసీసీఐ ట్విట్టర్ ఎక్స్ లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో అతడికి తాము అండగా ఉంటామని ప్రకటించింది. జట్టు కూడా అతడికి భరోసా కల్పిస్తుందని వివరించింది.. శుక్రవారం ఇంగ్లాండ్ బ్యాటర్ జాక్ క్రాలీ వికెట్ తీయడం ద్వారా టెస్టుల్లో 500 వికెట్లు తీసిన భారత స్పిన్నర్ గా రవిచంద్రన్ రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్ లలో ఈ ఘనత సాధించిన రెండవ బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ వినతి కెక్కాడు. బ్యాటింగ్ లోనూ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటాడు. మూడో టెస్టులో 37 పరుగులు చేసి ధృవ్ తో కలసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

రవిచంద్రన్ అశ్విన్ తల్లి కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం అంత బాగా లేకపోవడం.. ఈ సమయంలో పక్కన ఉండాల్సి రావడంతో రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా రాజ్ కోట్ మైదానాన్ని వీడాడు అని బీసీ సీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ట్విట్టర్ ఎక్స్ లో ప్రకటించారు. రాజ్ కోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ చెన్నై బయల్దేరినట్టు ఆయన వివరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రవిచంద్రన్ అశ్విన్ తల్లి త్వరగా కోలుకోవాలని రాజు శుక్లా ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు ప్రస్తుతం అశ్విన్ ఉన్న ఈ పరిస్థితుల్లో అతడి కుటుంబ సభ్యుల గోప్యతకు భంగం కలిగించకుండా ఉండాలని శుక్లా కోరాడు. మీడియా, ఇతర వ్యక్తులు సమయమనం పాటించాలని సూచించాడు. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో రవిచంద్రన్ అశ్విన్ కు బోర్డు కావలసినంత సాయం అందిస్తుందని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు.

కాగా, రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలు చేసి ఆకట్టుకున్నారు. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. 133 పరుగులతో డక్కెట్, జో రూట్ క్రీజ్ లో ఉన్నారు. ఇప్పటివరకు భారత జట్టు తరఫునుంచి అశ్విన్, సిరాజ్ చెరో వికెట్ తీశారు. ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్ అర్ధాంతరంగా ఇంటికి వెళ్లిపోవడం భారత జట్టుకు కోలుకోలేని దెబ్బే. ఇక ప్రస్తుతం భారత జట్టులో పూర్తిస్థాయి బౌలర్లు నలుగురే ఉన్నారు. వీరి ప్రతిభ మీదనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.