Prithvi Shaw: చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.. ఫృథ్వీ షా ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది?

2018లో పృథ్వీ షా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. తొలి టెస్ట్ లోనే సెంచరీ సాధించాడు. ఆ తరువాత బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి ఎంపికై.. ఆడిలైడ్ లో జరిగిన తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో దారుణంగా విఫలమయ్యాడు.

Written By: BS, Updated On : July 19, 2023 9:47 am

Prithvi Shaw

Follow us on

Prithvi Shaw: స్వయంకృతాపరాధం అంటారు.. అంటే మనం చేసుకున్న పనులే ఒక్కోసారి మన కర్మను నిర్దేశిస్తాయి. ఈ మాట ప్రస్తుతం టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వి షాకు అక్షరాల సరిపోతుంది. కొన్నాళ్ల కిందటి వరకు భవిష్యత్ స్టార్ గా, టీమిండియా ఆశాకరణంగా ఎదుగుతాడని కితాబు అందుకున్న పృథ్వీషా.. ప్రస్తుతం జట్టులో చోటు దక్కించుకోవడం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీసీసీఐ జట్టులో యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పిస్తుంటే.. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేని స్థితిలోకి వెళ్లిపోయాడు పృథ్వీ షా. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే భారత జట్టులోకి ఇప్పట్లో వచ్చే అవకాశం పృథ్వీ షాకు కనిపించడం లేదు.

కొన్నాళ్ల కిందటి వరకు పృథ్వీ షా పేరు చెబితే.. టీమిండియా స్టార్ క్రికెటర్ గా భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉన్న ఏకైక ఆటగాడిగా చాలామంది చెప్పేవారు. అండర్ 19, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా అదరగొడుతూ అతి తక్కువ వయసులోనే టీమిండియా కి సెలెక్ట్ అయ్యాడు. 18 ఏళ్ళ వయసులోనే తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసి భవిష్యత్తు ఇండియా స్టార్ గా అందరి నుంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఐపీఎల్ లో కూడా అదరగొడుతూ తన ఫాలోయింగ్ ను భారీగా పెంచుకోవడంతోపాటు.. యువ ఆటగాళ్లకు అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు. పృథ్వీ షా ఆటతీరును నిశితంగా గమనించిన ఎంతోమంది సచిన్ టెండుల్కర్ లోని క్లాస్, వీరేంద్ర సెహ్వాగ్ లోని దూకుడు కలగలిపిన ఆటగాడు అంటూ ఎంతోమంది కీర్తించారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పృథ్వీ షా గత కొన్నాళ్లుగా దారుణమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. దీంతో టీమ్ ఇండియాలోనే కాకుండా ఐపీఎల్ జట్టులో కూడా స్థానం లభించని పరిస్థితికి చేరుకున్నాడు.

నాటి నుంచి జట్టులో చోటు దక్కించుకోవడమే కష్టం..

2018లో పృథ్వీ షా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. తొలి టెస్ట్ లోనే సెంచరీ సాధించాడు. ఆ తరువాత బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీకి ఎంపికై.. ఆడిలైడ్ లో జరిగిన తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో దారుణంగా విఫలమయ్యాడు. అప్పుడు జట్టులో నుంచి వేటు పడిన తరువాత నుంచి జట్టులో చోటు దక్కించుకోవడమే కష్టంగా మారింది. ఆ తర్వాత నుంచి సెలక్టర్లు మరో అవకాశం కూడా ఇవ్వలేదు. 2020లో న్యూజిలాండ్ పై వన్డేలో, 2021లో శ్రీలంకపై టి20 లో అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. రెండేళ్లుగా అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో కూడా నిరాశ పరచడం అతడికి ప్రతికూలంగా మారింది. ఇటీవల ఆసియా గేమ్స్ కు, ఐర్లాండ్ తో జరిగే సిరీస్ కు సెలక్టర్లు యువకులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఈ యువకులతో కూడిన జట్టులో కూడా సెలక్టర్లు షాకు అవకాశం కల్పించలేదు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జట్టులోకి ఎంపిక చేయకపోవడం పట్ల షా కూడా ఒకంత అసహనాన్ని సెలక్టర్లపై వ్యక్తం చేస్తున్నాడు.

ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యాకే జట్టులోకి..

సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరు పట్ల పృథ్వీ షా అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా టూర్ లో ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడానని, ఒక్క అవకాశంతో తనని ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదంటూ వాపోయాడు. ఫిట్నెస్ వంకగా చూపిస్తున్నారని, ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యాకే టీమ్ కు ఆడానని స్పష్టం చేశాడు. ఒకే ఒక్క మ్యాచ్ తో తన టెక్నిక్ ను ఎలా డిసైడ్ చేస్తారని, జట్టులో స్థానం దక్కనందుకు చాలా నిరుత్సాహపడుతున్నట్లు పృథ్వీ షా ఆవేదన వ్యక్తం చేశాడు. తన గురించి జనాలు చాలా చెప్పుకుంటారు గానీ వ్యక్తిగతంగా తాను చాలా ప్రైవేట్ పర్సన్ అని, స్నేహితులు కూడా లేరని వాపోయాడు. ఎవరితోనో తన విషయాలను షేర్ చేసుకోనని బాధగా అనిపించినప్పుడు రూమ్ లోకి వెళ్లి ఒంటరిగా కూర్చుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు. బయటకు వెళితే జనాలు నవ్వుతూ తనను ఏడిపిస్తారని, అందుకే ఒంటరితనం అలవాటు చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు పృథ్వీ షా. అయితే, పృథ్వీ షా చెబుతున్న మాటలకు, అతడి చేష్టలకు సంబంధమే లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫామ్ లో ఉన్నప్పుడు క్రికెట్ పై దృష్టి సారించకుండా ఇతర వ్యాపకాల్లో నిమగ్నం కావడం వల్లే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని, ఎవరు చేసిన దానికి వాళ్లే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, పృథ్వీ షా విషయంలో ప్రస్తుతం అదే జరుగుతోందని పలువురు పేర్కొంటున్నారు.