https://oktelugu.com/

PM Modi: 8న విశాఖకు ప్రధాని.. స్టీల్ ప్లాంట్ పై కీలక ప్రకటన!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దుమారం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పట్లో దీనికి ఫుల్ స్టాప్ పడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధాని మోదీ క్లారిటీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 3, 2025 / 10:14 AM IST

    PM Modi(2)

    Follow us on

    PM Modi: ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈనెల 8న విశాఖకు రానున్నారు. అందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయ్యింది. ప్రధాని పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. క్యాబినెట్ భేటీలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులకు పిలుపునిచ్చారు. దాదాపు లక్ష కోట్లతో నిర్మించే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు మోడీ. అయితే ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ అంశంపై కీలక ప్రకటన చేస్తారని ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి కూటమి ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ కేంద్రం మాత్రం దూకుడు మీద ఉంది. దీంతో ఒక రకమైన గందరగోళం నెలకొంది. అందుకే విశాఖ వస్తున్న ప్రధాని మోదీ దీనిపై స్పష్టత ఇస్తారని ప్రచారం నడుస్తోంది.

    * సరికొత్త ప్రతిపాదన
    అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం సరికొత్త ప్రతిపాదన చేసినట్లు సమాచారం. 17వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే ప్లాంట్ కు నిధులుగా కాకుండా టెక్నాలజీ రూపంలో ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ ప్లాంట్ లో మూడు బ్లాస్ట్ ఫర్నిసుల ద్వారా స్టీల్ తయారు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ముడి పదార్థాలను సమకూర్చుకోవడం కూడా సమస్యగా మారుతోంది. దీంతో రెండు బ్లాస్ట్ ఫర్నిసులనే వినియోగిస్తున్నారు. ఈ సమయంలో కొత్తగా మూడు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసుల ఏర్పాటుకు నిధులు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.

    * అది ప్రైవేటీకరణ అంటున్న కార్మిక వర్గాలు
    అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. ఈ ప్రతిపాదనతోనే ప్రైవేటీకరణ ఎంట్రీకి నిర్ణయించారని ప్రచారం నడుస్తోంది. అయితే ఈ కొత్తగా ప్రతిపాదనల వెనుక పోస్కో కంపెనీ పేరు వినిపిస్తోంది. ఈ సంస్థ నాలుగేళ్ల క్రితమే విశాఖ ఉక్కు తో జాయింట్ వెంచర్ కోసం ప్లాంట్ లో 1500 ఎకరాలు కేటాయించాలని ప్రతిపాదన చేసింది. అత్యాధునికంగా స్టీల్ ఉత్పత్తి చేసి లాభాల్లో వాటా ఇస్తామని ఆఫర్ చేసింది. కానీ అప్పట్లో కార్మిక సంఘాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగా ఈ ప్రతిపాదన చేస్తున్నారని నిరసనకు దిగాయి. దీంతో ఈ ఆలోచన అమలు కాలేదు. అయితే ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యంతో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి పెంచాలని కేంద్రం భావిస్తోంది. కానీ అది ప్రైవేటీకరణలో భాగమేనని కార్మిక వర్గాలు అనుమానిస్తున్నాయి. దాని బదులు ఆర్థికంగా సాయం అందించాలని కోరుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖకు ప్రధాని వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక స్పష్టత రానుంది.