Shreyas Iyer injury updates: టీమిండియా వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో గాయపడ్డాడు. పక్కటెముకలకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆస్ట్రేలియాలోనే ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్ట్రేలియాలోనే అతడు చికిత్స పొందాడు. ఆ తర్వాత అతడు హెల్త్ గురించి బీసీసీఐ ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఆస్ట్రేలియా ప్లేయర్ హేజిల్ వుడ్ అయ్యర్ ను పరామర్శించాడు. ఆ సమయంలో అంతా బాగుందని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించాడు.
అయ్యర్ చికిత్స పొందిన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని ఆమధ్య వార్తలు వచ్చాయి.. అయినప్పటికీ తన ఆరోగ్యం గురించి అయ్యర్ కూడా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.. ఈ క్రమంలో అయ్యర్ ఆరోగ్య పరిస్థితి పై ఒక కీలకమైన సమాచారం వచ్చింది.. ఈ విషయాన్ని పంజాబ్ జట్టు సహాయజమాని ప్రీతి జింటా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అంతేకాదు అతనితో కలిసి ఒక సెల్ఫీ కూడా దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అయ్యర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయ్యర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని ప్రీతి జింటా పేర్కొంది. పంజాబ్ జట్టు ఆటగాడు శశాంక్ సింగ్ జన్మదిన వేడుకలలో అయ్యర్ పాల్గొన్నట్టు ప్రీతిజింటా వెల్లడించింది. వారిద్దరితో కలిసి దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకుంది. అయ్యర్ అద్భుతంగా రికవరీ అవుతున్నాడని.. అతడు బయటికి రావడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొంది.. శశాంక్ సింగ్ పుట్టినరోజు వేడుకల్లో తాము పాల్గొన్నామని, ఆ సందర్భాన్ని ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించామని ప్రీతి వెల్లడించింది.
గాయం కావడం వల్ల అయ్యర్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. అంతకుముందు జరిగిన వెస్టిండీస్ సిరీస్ కు కూడా దూరమయ్యాడు.. త్వరలో సౌత్ ఆఫ్రికా తో జరిగే వన్డే సిరీస్, టి20 సిరీస్ కు కూడా అయ్యర్ దూరమవుతాడని తెలుస్తోంది. అతడి ఆరోగ్యం మెరుగుపడితే వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ కు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది.