Kesineni Nani : రాజకీయాల్లో చేరికల విషయంలో చాలామంది నేతలు మాట తప్పుతారు. అప్పట్లో తాము ప్రకటించిన పరిస్థితులు.. తరువాత జరిగిన పరిణామాలతో చాలామంది పొలిటికల్ గా యాక్టివ్ అవుతారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని చెప్పుకొచ్చారు. కానీ నిత్యం మాట్లాడుతూనే ఉన్నారు. అవసరం అనుకుంటే తిరిగి రాజకీయాల్లోకి వస్తానని కూడా చెబుతున్నారు. ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్. అయితే ఇప్పుడు ఆయన సైతం మనసు మార్చుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ ద్వారా పెద్ద పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు మరో మాజీ ఎంపీ కేశినేని నాని సైతం మనసు మార్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కేశినేని నాని. ఓటమి తర్వాత రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన సైతం పొలిటికల్ కామెంట్స్ చేస్తూ తన రాజకీయాల రీ ఎంట్రీ పై సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన విషయంలో ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. తిరిగి ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది.
* చంద్రబాబు ప్రోత్సాహంతో..
ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో ఉండేవారు కేసినేని నాని( Kesineni Nani ). కేశినేని ట్రావెల్స్ రూపంలో బస్సుల వ్యాపారం నడిపేవారు. చంద్రబాబు ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో తొలిసారిగా టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం తట్టుకొని విజయవాడ ఎంపీగా రెండోసారి గెలిచారు. అయితే అదంతా పార్టీ మహిమ కాదని.. తన వ్యక్తిగత చరిష్మతో గెలిచానని బ్రమపడ్డారు. చాలా విషయాల్లో టిడిపి నాయకత్వాన్ని తక్కువ అంచనా వేశారు. అదే సమయంలో ఆయన సోదరుడు చిన్ని అలియాస్ శివనాథ్ టిడిపి నాయకత్వానికి దగ్గరయ్యారు. అప్పటినుంచి కేశినేని నాని పార్టీకి దూరమవుతూ వచ్చారు. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు నాని. దారుణమైన ఓటమితో తీవ్ర మనస్థాపానికి గురై క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
* ప్రత్యామ్నాయంగా భావించి..
అయితే విజయవాడ( Vijayawada) అంటేనే తనకు ప్రాణమని.. తన ప్రాణం ఉన్నంతవరకు విజయవాడ ను వదిలిపెట్టబోనని.. ప్రజలకు సేవ చేయాలంటే ఒక్క రాజకీయ రంగమే కాదని చెప్పుకొచ్చారు కేసినేని నాని. తద్వారా తన రీయంట్రీ ఉంటుందని అప్పట్లోనే సంకేతాలు ఇచ్చారు. మాతృ పార్టీ టిడిపిలో చేరేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అదే సమయంలో కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేసినేని నాని బిజెపిలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ వ్యవహారంలో వచ్చిన పరిణామాలతోనే కేసినేని నాని పార్టీకి దూరమయ్యారని.. టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు బాగానే నిలబడ్డారని నాయకత్వం భావిస్తోంది. అయితే విజయవాడ జిల్లాలో జరిగిన పరిణామాలు.. ఆపై తన సోదరుడి ఉన్నతి వెనుక లోకేష్ ఉన్నారన్నది కేశినేని నాని లో ఉన్న అనుమానం. అయితే ఇప్పుడు నాని బిజెపిలో చేరితే టిడిపి నాయకత్వం నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండవని తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో విజయవాడ ఎంపీ సీటు ఆశించి కేశినేని చిన్ని బిజెపిలో చేరుతున్నారు. ఇటీవల ఎంపీ కేసినేని శివనాథ్ చర్యలతో పార్టీకి కొంత డ్యామేజ్ జరిగిందని.. ప్రత్యామ్నాయం కోసం కేశినేని నానిని బిజెపిలో చేర్పిస్తున్నారని టిడిపి నాయకత్వం పై ఒక ప్రచారం ఉంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.