V Hanumantha Rao: సన్ రైజర్స్ అందుకే ఫైనల్ చేరిందట.. వీహెచ్ తాత కామెడీ పీక్స్..

ప్రస్తుతం ఐపీఎల్ జోరుగా సాగుతోంది. ఆదివారం చెన్నై వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.. కప్ కోసం కోల్ కతా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : May 26, 2024 9:34 am

V Hanumantha Rao

Follow us on

V Hanumantha Rao: రాజకీయాలలో భజనకు ఉన్నంత ప్రాధాన్యం.. భజన పరులకు దక్కినంత ప్రయారిటీ.. మరెవరికీ దక్కదు. ఇలాంటి భజన పరుల వల్ల పార్టీ కోసం తీవ్రంగా శ్రమించే వారికి.. అహర అహరం కష్టపడే వారికి.. అవకాశాలు దక్కకుండా పోతున్నాయి. భజనపరుల వల్ల పార్టీ పెద్దలు ఆనందిస్తారేమో గాని.. జనాల్లో మాత్రం చులకన అవుతారు. ప్రస్తుతం తెలంగాణలో ఓ అధికార పార్టీ సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు.. ఓ దివంగత ప్రధానమంత్రి కీర్తి కి ఇబ్బంది కలుగజేస్తున్నాయి.. ఇంతకీ ఏం జరిగిందయ్యా అంటే..

ప్రస్తుతం ఐపీఎల్ జోరుగా సాగుతోంది. ఆదివారం చెన్నై వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.. కప్ కోసం కోల్ కతా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.. అయితే హైదరాబాద్ జట్టు గత కొన్ని సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. అయితే ఈసారి తన ఆట తీరు పూర్తిగా మార్చుకుంది. లీగ్ దశలో రెండవ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ లో తొలి మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ.. రెండో మ్యాచ్ లో రాజస్థాన్ పై గెలిచి ఫైనల్ దూసుకెళ్లింది. కప్ కోసం కోల్ కతా తో అమితుమి తేల్చుకొనుంది. అయితే ఈ ఘనత మొత్తం హైదరాబాద్ ఆటగాళ్లది కాదట. కేవలం ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడినందు వల్లే హైదరాబాద్ జట్టు ఫైనల్ వెళ్లిందట.. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజీవ్ గాంధీ కుటుంబానికి వీర విధేయుడు అయినటువంటి వీ. హనుమంతరావు. ఐపీఎల్ ఫైనల్ లోకి హైదరాబాద్ జట్టు వెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన గాంధీభవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశానికి రక్ష అని.. రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడినందువల్లే హైదరాబాద్ ఫైనల్ వెళ్లిందని పేర్కొన్నారు. మరి ఇదే హైదరాబాద్ జట్టు గత కొన్ని సీజన్లుగా రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడుతోంది. అలాంటప్పుడు అన్ని ఐపిఎల్ కప్ లు హైదరాబాద్ జట్టు గెలుచుకోవాలి. కానీ, అలా కాలేదు, జరగలేదు. మరి దీనికి హనుమంతరావు ఏమి సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.

హనుమంతరావు రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ఆడినందువల్లే హైదరాబాద్ ఫైనల్ చేరిందని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..”రాజీవ్ గాంధీకి భజన చేయి. సోనియాగాంధీకి ఊడిగం చేయి. రాహుల్ గాంధీకి సపర్యలు చేయి. కానీ ఇలా హైదరాబాద్ జట్టు సాధించిన ఘనతను రాజీవ్ గాంధీకి ఆపాదించకు. పాపం పైన ఉన్న ఆయన ఆత్మ ఇబ్బందిపడుతుంది.. ఆయన కీర్తికి ఇబ్బంది కలుగుతుందని” నెటిజన్లు చురకలంటిస్తున్నారు. “హైదరాబాద్ ఆటగాళ్లు ఎన్నో సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించారు. చివరికి ఇన్నాళ్లకు ఫైనల్ చేరుకున్నారు. జట్టు ఆడే తీరు చూసి అభినందించక.. దాన్ని రాజీవ్ గాంధీకి ఆపాదించడం ఏంటని” నెటిజన్లు హనుమంతరావు ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు..

హనుమంతరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో అర్జున్ రెడ్డి సినిమా విడుదలైనప్పుడు ఆయన అన్న మాటలు చర్చకు దారి తీసాయి. విజయ్ దేవరకొండ, హనుమంతరావు మధ్య మాటల యుద్ధం నడిచింది. చివరికి విజయ్ దేవరకొండ “చిల్ తాత” అంటూ గేలి చేశాడు. అప్పట్లో వార్తల్లో వ్యక్తి అయిన హనుమంతరావు.. మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ జట్టు పై వ్యాఖ్యలు చేయడం ద్వారా మరోసారి చర్చకు దారి తీశాడు. మరి దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాల్సి ఉంది.