Pawan Kalyan: ఏపీలో కూటమి గెలుస్తుందా? ఛాన్స్ ఉందా? ఒకవేళ అవకాశం లేకపోతే బీజేపీ పరిస్థితి ఏంటి?కేంద్రంలో అధికారంలోకి వచ్చి.. ఏపీలో రాకుంటే బిజెపి ఏం చేయనుంది? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తుంది. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. గత ఎన్నికల కంటే అదనంగా సీట్లు దక్కించుకుంటామని సీఎం జగన్, మంచి మెజారిటీతో అధికారంలోకి వస్తామని చంద్రబాబు బలంగా భావిస్తున్నారు. అయితే కూటమి అధికారంలోకి వస్తే పర్వాలేదు. చంద్రబాబు సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు. కానీ కూటమి అధికారంలోకి రాకుంటే.. పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఏపీలో కూటమి గెలుపోటములతో సంబంధం లేకుండా.. బిజెపి పావులు కదిపే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో పట్టు బిగించాలని కాషాయ పార్టీ భావిస్తోంది. ఒకవేళ కూటమి అధికారంలోకి రాకుంటే.. పవన్ కళ్యాణ్ ద్వారా స్ట్రాంగ్ అవ్వాలని చూస్తోంది. పవన్ కళ్యాణ్ ను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకొని సహాయ మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల తరువాత ఎన్డీఏలో చేరారు పవన్ కళ్యాణ్.ఎన్నికలకు ముందు టిడిపి తో కలిసింది బిజెపి.ఈ లెక్కన పవన్ కళ్యాణ్ తోనే బిజెపికి అనుబంధం ఎక్కువ.అందుకే పవన్ అయితే నమ్మదగిన మిత్రుడుగా బిజెపి భావిస్తోంది. పవన్ కళ్యాణ్ కు రాజకీయ అవకాశాలు ఇవ్వడంతో పాటు ఏపీలో గెలవాలని బిజెపి ఆలోచిస్తోంది.
ప్రస్తుతం పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆయన గౌరవానికి తగ్గట్టు చంద్రబాబు తప్పకుండా పదవి ఇస్తారు. అయితే పొరపాటున ఓటమి ఎదురైతే పవన్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. బిజెపి కోటాలో ఏదైనా రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. అనంతరం కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు బిజెపి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కు ఉన్న చరిష్మాను ఉపయోగించుకుని ఏపీలో పార్టీని అభివృద్ధి చేయాలన్నది బిజెపి అభిమతం. ఒకవేళ టిడిపి కూటమి గెలిచినా.. స్వతంత్రంగా ఎదిగే క్రమంలో పవన్ ద్వారా రాజకీయాలు చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఏపీలో కూటమి గెలుపోటములతో సంబంధం లేకుండా బిజెపి 2029 ఎన్నికలకు సొంతంగా వెళ్లాలన్నది అజెండాగా తెలుస్తోంది. మరి బిజెపి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.