SRH Vs KKR Final 2024: ఐపీఎల్ 17వ సీజన్ కీలక దశకు చేరుకుంది. అంతిమ ఘట్టం లో తలపడేందుకు హైదరాబాద్, కోల్ కతా జట్లు సిద్ధమయ్యాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7:30 నుంచి కోల్ కతా, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు ఈ సీజన్లో ఇప్పటివరకు రెండుసార్లు తలపడ్డాయి.. రెండుసార్లు కూడా కోల్ కతా విజేతగా నిలిచింది. అయితే టైటిల్ పోరులో ఎవరు గెలుపొందుతారనేది ఆసక్తికరంగా మారింది. కోల్ కతా లీగ్ దశలో మూడు సార్లు మాత్రమే ఓడిపోయి..భారీ రన్ రేట్ తో అగ్రస్థానంలో నిలిచింది.
హైదరాబాద్ కూడా లీగ్ దశలో భారీగా పరుగులు సాధించింది. ముంబై పై 277, బెంగళూరు పై 287 పరుగులు చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది. అంతేకాదు ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో పవర్ ప్లే లో 125 రన్స్ చేసి సరికొత్త ఘనతను లిఖించింది. అయితే ఈ జట్టు క్వాలిఫైయర్ -1 లో కోల్ కతా తో తలపడింది. హోరాహోరిగా సాగుతుందనుకున్న మ్యాచ్, ఏకపక్షంగా మారడంతో.. హైదరాబాద్ ఓడిపోక తప్పలేదు. అయితే ఆ మ్యాచ్ లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ హైదరాబాద్ రాజస్థాన్ జట్టుతో జరిగిన క్వాలిఫైయర్ -2 మ్యాచ్లో విజయం సాధించింది. మరోసారి కోల్ కతా తో పోరాడేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో సమఉజ్జిగా ఉన్న హైదరాబాద్ పై కోల్ కతా గెలవడం అంత సులభం కాదు. హోరా హోరీగా సాగే ఈ మ్యాచ్ లో ఎవరిది పై చేయి అనేది మరికొద్ది గంటల్లో తేలుతుంది.
అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా జట్టు కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ పేర్కొన్నాడు. “క్వాలిఫైయర్ -1 తర్వాత కోల్ కతా కు తగినంత విశ్రాంతి లభించింది. ఆ జట్టుకు వరంగా మారింది. కోల్ కతా కచ్చితంగా విజయం సాధిస్తుంది. సన్ రైజర్స్ బలాలు, బలహీనతలు కోల్ కతా కు తెలుసు. లీగ్, ప్లే ఆఫ్ లో ఆ జట్టుతో ఆడింది కాబట్టి కోల్ కతా ఫైనల్ మ్యాచ్లో నూ అదే వర బడి కొనసాగిస్తుంది. చెన్నై మైదానం ఎర్రమట్టితో కూడి ఉంటుంది. దీనిపై వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కచ్చితంగా ప్రభావం చూపిస్తారని” హెడెన్ పేర్కొన్నాడు. కాగా, హైదారాబాద్, కోల్ కతా జట్లు 27 మ్యాచులు ఆడాయి.. ఇందులో కోల్ కతా 18 మ్యాచ్లలో గెలిచింది. హైదరాబాద్ తొమ్మిది మ్యాచ్లలో మాత్రమే విజయ సాధించింది.