ICC Champions Trophy 2024 : భారత్ , పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఈనాటివి కావు. కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అందువల్లే ఈ రెండు దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. భారత జట్టు పాకిస్థాన్లో క్రికెట్ ఆడక చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇకపై ఆడే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ ట్రోఫీలో తాము పాకిస్థాన్లో ఆడబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి పలు దఫాలుగా అంతర్జాతీయ క్రికెట్ మండలికి చెప్పింది. పాలు దఫాలుగా లేఖలు కూడా రాసింది. ఈ నేపథ్యంలో భారత స్పందనను ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు తెలియజేసింది. దీనిని మొదట్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పు పట్టింది.. ఇలా వ్యవహరించడం సరికాదని వివరించింది. అయినప్పటికీ బీసీసీఐ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా తమ ఆటగాళ్ల భద్రత అత్యంత ముఖ్యమని బీసీసీఐ ఐసీసీ కి వెల్లడించింది. దీంతో ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సూటిగా చెప్పేసింది.. భారత్ ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని సూచించింది. దీనికి మొదట్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోలేదు. దీంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని వేరే వేదిక వద్ద నిర్వహిస్తామని చెప్పడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు పరిస్థితి తీవ్రత అర్ధమైంది. వెంటనే హైబ్రిడ్ మోడ్ విధానానికి ఒప్పుకుంది ఇదే విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ ప్రకటించారు. శుక్రవారమే ఈ వ్యవహారానికి సంబంధించి ఐసీసీ పాలకమండలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్ లు దుబాయ్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించారు. గత ఆసియా కప్ పాకిస్తాన్ వేదికగా జరగగా.. భారత్ ఆడిన మ్యాచ్ లు మొత్తం దుబాయ్ లో నిర్వహించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అదే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. శుక్రవారమే అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారని అనుకున్నప్పటికీ.. అది శనివారానికి వాయిదా పడింది. మొత్తానికి శనివారం ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
మహిళల జట్టు కూడా..
పురుషుల జట్టు మాత్రమే కాకుండా మహిళల జట్టు కూడా పాకిస్తాన్లో ఆడదు. పాకిస్తాన్ మహిళల జట్టు కూడా భారత్లో ఆడదు. ఈ రెండు జట్లు ఆడే మ్యాచ్ తటస్థ వేదికగా జరుగుతాయి. త్వరలో మహిళల వరల్డ్ కప్ జరగనుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత.. భారత్ – శ్రీలంక వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుంది. 2026 లో ఈ టోర్నీ నిర్వహిస్తారు. ఈ టోర్నీలో భాగంగా పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లు శ్రీలంకలో నిర్వహిస్తారు. గత ఆసియా కప్ లో భారత్ ఆడిన మ్యాచ్ లను దుబాయ్ వేదికగా నిర్వహించారు.