Paris Olympics 2024: ఒలింపిక్స్.. ఈ పేరు వినిపిస్తే చాలు.. పటిష్టమైన ఏర్పాట్లు, కట్టుదిట్టమైన నిబంధనలు, అనితర సాధ్యమైన పోటీలు గుర్తుకొస్తాయి. ప్రపంచ స్థాయి క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతుంటే.. చూసే అభిమానులకు వీనుల విందుగా ఉంటుంది. అలాంటి చోట నిబంధనలకు పాతర వేశారని.. మగ లక్షణాలు ఉన్న బాక్సర్ ను ఆడ బాక్సర్ పై పోటీకి దించారని.. అందువల్లే కేవలం సెకండ్ల వ్యవధిలోనే మ్యాచ్ ముగిసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పారిస్ వేదికగా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహిళల బాక్సింగ్ పోటీ నిర్వహించారు. ఈ పోటీలో ఇటలీ బాక్సర్ కు చరిత్రలో ఏ క్రీడాకారిణికి జరగని అన్యాయం ఎదురైంది. లింగ నిర్ధారణ పరీక్షలో అన్ని విభాగాలలో విఫలమైన అల్జీరియా బాక్సర్ ఇమేన్ ఖలీఫ్ కు ఒలింపిక్స్ నిర్వాహకులు పోటీలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ఖలీఫ్ చేతిలో ఇటలీ బాక్సర్ ఏంజెలా కారి తీవ్రంగా గాయపడింది..
46 సెకండ్ల వ్యవధిలోనే..
ఇమేన్ ఖలీఫ్, ఏంజెలా కారి మధ్య బాక్సింగ్ మ్యాచ్ కేవలం 46 సెకండ్ల వ్యవధిలోనే ముగిసింది. ఖలీఫ్ ఇచ్చిన పంచ్ తో కారి బౌట్ నుంచి నిష్క్రమించింది. కారి బౌట్ నుంచి వెళ్లిపోవడంతో ఒలింపిక్ నిర్వాహకులపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మహిళల 66 కిలోల ప్రిలిమినరీ బాక్సింగ్ రౌండ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.. ఖలీఫ్ గుద్దిన పిడి గుద్దుకు కారి తట్టుకోలేకపోయింది. చూస్తున్న ప్రేక్షకులకు కారి ముక్కు పగిలిందేమోనని అనిపించింది.. తీవ్రమైన నొప్పితో విలవిలలాడిన కారి వెంటనే బౌట్ నుంచి నిష్క్రమించింది. కన్నీటి పర్యంతమౌతూ తన బాధను వ్యక్తం చేసింది. ఖలీఫ్ కొట్టిన పంచ్ కు కారి హెడ్ సేఫ్టీ రెండుసార్లు కింద పడింది.. ఖలీఫ్ అదే తీరుగా పంచ్ లు విసురుతుండడంతో కారి భయంతో వణికిపోయింది.. ముక్కు ప్రాంతంలో విపరీతమైన నొప్పి రావడంతో బౌట్ నుంచి కారి వైదొలిగింది. మ్యాచ్ అనంతరం ఖలీఫ్ కు కారి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు.
ఎందుకు ఇచ్చినట్టు
ఖలీఫ్ లో xy క్రోమోజోమ్ లు ఉన్నాయని.. ఆమెలో మగలక్షణాలు నిగుడికృతమై ఉన్నాయని గతంలోని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమెకు బాక్సింగ్ విభాగంలో ఎంట్రీ దక్కడం అనుమానమే అనిపించింది. కానీ ఒలింపిక్ నిర్వాహకులు అవేవీ పట్టించుకోకుండా ఆమెకు బాక్సింగ్ లో అవకాశం కల్పించారు. అయితే గత ఏడాది జరిగిన బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఖలీఫ్ కు నిర్వాహకులు అవకాశం ఇవ్వలేదు. బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ నిర్వాహకుల మాదిరిగా ఒలింపిక్ కమిటీ ఆలోచించలేకపోయింది.. బాక్సింగ్ పోటీలో పాల్గొనేందుకు ఖలీఫ్ కు అవకాశం ఇచ్చింది. అయితే ఆమె విసిరిన పంచ్ దెబ్బలకు కారా తీవ్రమైన నొప్పితో బాధపడింది. ” ఇప్పుడు నేను ఏమీ చెప్పదలుచుకోలేదు. అర్హత గురించి మాట్లాడాలనుకోవడం లేదు. మెడల్ సాధించాలని ఇక్కడిదాకా వచ్చాను. కానీ నాకు తొలి రౌండ్ లోనే తీవ్రమైన ప్రతిఘటన ఎదురయింది. ఈ నొప్పి నుంచి నేను కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ముందుగా నాకు నేను సమాధానం చెప్పుకోవాలని” మ్యాచ్ అనంతరం కన్నీటి పర్యంతమవుతూ కారా వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని లేపుతున్నాయి. ఇదే క్రమంలో ఒలింపిక్ నిర్వాహకులపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ” మగలక్షణాలు ఉన్న ఆడ బాక్సర్ కు ఆడేందుకు ఎలా అవకాశం ఇస్తారు? కచ్చితత్వానికి, పకడ్బందీ విధానానికి మారుపేరైనా ఒలింపిక్ కమిటీ ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు. ఇలా ద్వంద్వ ప్రమాణాలతో పోటీలు నిర్వహించే కంటే.. మూసుకోవడం ఉత్తమం” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. కారా కు బాసటగా నిలుస్తున్నారు. నీకు మేమున్నామంటూ ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం కారా అనుకూల పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.