Paris Olympics 2024: ప్రతిష్టాత్మకమైన పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ సాధించాలని ప్రతి ఆటగాడు భావిస్తుంటాడు. దానినే జీవిత లక్ష్యంగా మలచుకుంటాడు. విశ్వ క్రీడా వేదికపై అద్భుతమైన ప్రతిభ చూపి, మెడల్ మెడలో వేసుకోవాలనుకుంటాడు. దానికోసం ప్లేయర్లు ఎన్నో కష్టాలు పడతారు. మరెన్నో ఇబ్బందులు పడతారు. కాలంతో సంబంధం లేకుండా నిరంతరం మైదానంలోనే గడుపుతుంటారు. ఇదే సమయంలో మెడల్ సాధిస్తే తమ పడిన శ్రమను మొత్తం మర్చిపోతుంటారు. విజయాన్ని ఆస్వాదిస్తూ ప్రపంచాన్ని గెలిచామన్న ఆనందంతో సాంబార్ పడిపోతుంటారు. విశ్వక్రీడా పోటీల్లో ప్రతిభే గీటురాయి. ఆ ప్రతిభకు కాస్త అదృష్టం తోడైతే మెడల్ దక్కినట్టే. లేకపోతే ఆటగాళ్లకు మరో నాలుగేళ్ల పాటు ఎదురుచూపు తప్పదు.
ఏడు మెడల్స్ పోయాయి
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు వెంట్రుక వాసిలో ఏడు మెడల్స్ మిస్ చేసుకున్నారు. ఫలితంగా ఆ పోటీలలో భారత ప్లేయర్లు నాలుగో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఈ పోటీలలో ఒకవేళ అదృష్టం కూడా కలిసి వచ్చుంటే భారత్ కచ్చితంగా మరో ఏడు మెడల్స్ సాధించేది.
100 గ్రాముల తేడాతో
భారత మల్ల యోధురాలు వినేశ్ ఫొగాట్.. సెమీఫైనల్ దాకా రెజ్లింగ్ పోటీలలో అద్భుతమైన ప్రతిభ చూపింది. ఫైనల్స్ లో స్వర్ణం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో ఆమె ఆ పోటీలో పాల్గొనలేకపోయింది. 2016 రియో, 2020 టోక్యోలో ఎదురైన అనుభవమే పారిస్ లోనూ వినేశ్ కు పునరావృతమైంది.
అంచనాలు లేకుండానే..
షూటింగ్ విభాగంలో ఏమాత్రం అంచనాలు లేకుండా మహేశ్వరి చౌహన్, అనంత్ జీత్ సింగ్ బరిలోకి దిగారు. అద్భుతమైన ప్రదర్శన చూపే నాలుగో స్థానంలో నిలిచారు. స్కీట్ మిక్స్ డ్ టీమ్ కాంస్య పతక పోరులో అనంత్, మహేశ్వరి జోడి 43-44 తేడాతో చైనా జోడి జియాంగ్, జియాన్ చేతిలో ఓడిపోయింది. ఒక్క పాయింట్ తేడాతో కాంస్యాన్ని కోల్పోయింది.
ఒక్క కిలో తేడాతో
టోక్యోలో జరిగిన ఒలంపిక్స్ లో రజత పతకం సాధించి స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డు సృష్టించింది. పారిస్ లో ఆ ఘనతను కొనసాగించలేకపోయింది. 49 కిలోల కేటగిరిలో పోటీకి దిగిన మీరా 199 కిలోలు ఎత్తి నాలుగో స్థానంతో సరిపుచ్చుకుంది.
ఆర్చరీలో నిరాశ
ఆర్చరీ విభాగంలో భారత జట్టు జోడి బొమ్మదేవర ధీరజ్, అంకిత భకత్ మెడల్స్ సాధిస్తారని అందరూ అనుకున్నారు. వారిద్దరు కూడా సెమీఫైనల్ దాకా వెళ్లారు.. ఈ విభాగంలో అమెరికా జోడి ఎలిసన్, క్యాసీ చేతిలో 6-2 తేడాతో ధీరజ్, అంకిత ఓడిపోయారు.
అంతరం 1.4. మాత్రమే
ఇక పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ లోకి భారత యువ షూటర్ అర్జున్ చేరుకున్నాడు. అయితే చివరికి 1.4 తేడాతో మెడల్ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన పోరులో అర్జున్208.4 పాయింట్లు సాధించాడు. క్రొయేషియా షూటర్ మారిసిచ్ టు జీరో నైన్ పాయింట్ ఎయిట్ పాయింట్లు సాధించి కాంస్యం సొంతం చేసుకున్నాడు.
లక్ష్య సేన్ కు ఎదురు దెబ్బ
ఒలింపిక్స్ లో యువ బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్యసేన్ అంచనాలకు మించి ఆడాడు. అద్భుతమైన ప్రతిభ చూపించాడు..కాంస్యం పోరులో తడబడ్డాడు. చివరి రెండు గేమ్ లలో ఒత్తిడికి గురయ్యాడు.
హ్యాట్రిక్ మిస్సయింది
ఈ ఒలింపిక్స్ లో వేరువేరు ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించిన స్టార్ షూటర్ మనుభాకర్.. హ్యాట్రిక్ ఛాన్స్ మిస్సయింది. 25 మీటర్ల పిస్టల్ పోరులో మనుభాకర్ హంగరి షూటర్ వేరోనిక తో జరిగిన వర్గీకరణ షూట్ లో వెనుకంజ వేసింది. నాలుగో స్థానంలో నిలిచింది.
పోరాడినప్పటికీ ఫలితం లేదు
భారత యువ మల్ల యోధురాలు రితిక తీవ్రంగా పోరాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. 76 కిలోల క్వార్టర్స్ బౌట్ లో రితిక ఐపెరి (కిర్గి స్థాన్) చేతిలో ఓటమిపాలైంది. వాస్తవానికి రితిక – ఐపెరి 1-1 తో సమానంగా ఉన్నప్పటికీ.. చివరి పాయింట్ పరిగణనలోకి తీసుకుంటూ కిర్గి స్థాన్ రెజ్లర్ ను విజేతగా ప్రకటించారు.
వాస్తవానికి ఇలా భారత అథ్లెట్లు మెడల్స్ కోల్పోవడం ఇది తొలిసారి కాదు. మిల్కా సింగ్, పీటీ ఉష, సానియా మీర్జా ఒలింపిక్ పతకాలను నాలుగో స్థానంలో నిలవడం ద్వారా కోల్పోయారు. మొత్తంగా పారిస్ వేదికగా జరిగిన ఒలంపిక్స్ లో ఒకవేళ మన దేశ అథ్లెట్లు గొప్పగా రాణిస్తే నాలుగో స్థానం నుంచి కాస్త మూడో స్థానానికి వెళ్లేవారు. ఫలితంగా మరో 7 పతకాలు మన దరిచేరేవి. లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే వచ్చే ఒలింపిక్స్ లో నైనా భారత్ డబుల్ డిజిట్ మార్క్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.