Paris Olympics 2024: ఈ ప్రదర్శన తో జబ్బలు చరుచుకుంటున్నాం సరే.. పదుకునే బాధ ఆటగాళ్లకు ఇప్పటికైనా అవగతమవుతుందా?

ఈసారి ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో స్టార్ షట్లర్ సింధు మెడల్ సాధించకుండానే ఇంటిదారి పట్టింది. దీంతో భారత అభిమానులు నిరాశలో మునిగిపోయారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్యసేన్ .. మెడల్ పై అంచనాలు పెంచాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 11, 2024 9:04 am

Paris Olympics 2024

Follow us on

Paris Olympics 2024: విశ్వ క్రీడలు.. ఈ పేరు వినగానే ఏ ఆటగాడు అయినా సరే రెట్టిచ్చిన ఉత్సాహంతో గంతులు వేస్తాడు. తాను ఎంచుకున్న ఆటలో అద్భుతమైన ప్రతిభ చూపి.. మెడల్ సాధించాలని భావిస్తాడు. ఇందులో భాగంగానే తీవ్రంగా కసరత్తు చేస్తుంటాడు. కాలంతో సంబంధం లేకుండా మైదానంలో గడుపుతుంటాడు. శరీరాన్ని హూనం చేసుకుంటాడు. చెమటోడ్చుతూ కసరత్తులు చేస్తుంటాడు. ఇలాంటి ఆటగాడు మైదానంలోకి దిగిన తర్వాత తన స్థాయి ప్రతిభ చూపే క్రమంలో.. ఆ కాస్త అదృష్టం కూడా తోడైతే మెడల్ దక్కినట్టే. విశ్వ క్రీడా వేదికపై అతని వాంఛ నెరవేరినట్టే. అయితే ఇలాంటి వాంఛలతోనే ఈసారి పారిస్ వేదికగా జరిగిన భారత్ నుంచి చాలామంది క్రీడాకారులు వెళ్లారు. ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు అద్భుతమైన ప్రతిభ చూపినప్పటికీ భారత్ ఆరు మెడల్స్ మాత్రమే సాధించింది. ఇంకా కొన్ని విభాగాలలో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ గనుక భారత్ ఆవిభాగాలలో మూడో స్థానంలో నిలిచి ఉంటే కచ్చితంగా ఏడు మెడల్స్ సాధించి ఉండేది.. దీంతో ఈసారి డబుల్ డిజిట్ మార్క్ కల నెరవేరేది.

బ్యాడ్మింటన్ పోరులో ..

ఈసారి ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో స్టార్ షట్లర్ సింధు మెడల్ సాధించకుండానే ఇంటిదారి పట్టింది. దీంతో భారత అభిమానులు నిరాశలో మునిగిపోయారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్యసేన్ .. మెడల్ పై అంచనాలు పెంచాడు. అద్భుతమైన ఆట తీరుతో అలరించాడు. కాంస్యం పోరులో తొలి గేమ్ గెలిచాడు. రెండవ గేమ్ లో లీడ్ లో కొనసాగాడు . అయితే అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. ఆ ఓటమితో భారత అభిమానులు తీవ్రమైన నిరాశలో మునిగిపోయారు. ఈ క్రమంలో లక్ష్యసేన్ కు కోచ్ గా వ్యవహరించిన.. బ్యాడ్మింటన్ దిగ్గజ ఆటగాడు ప్రకాష్ పదుకొనే కు కోపం తారస్థాయికి చేరింది. ఇదే సమయంలో తట్టుకోలేని బాధ కూడా తన్నుకొచ్చింది. తో ఆయన ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇది చాలామందికి ఇబ్బంది కలిగించినప్పటికీ.. ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు..

ప్రతిష్టాత్మకమైన పోటీలలో ఆటగాళ్లు పాల్గొంటున్నప్పుడు కచ్చితంగా జవాబుదారితనం కలిగి ఉండాలి. ఇదే సమయంలో వ్యవస్థ కూడా మారాలి. క్రీడాకారులు మానసికంగా బలవంతం కావాలి. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ఒలింపిక్స్ లాంటి అత్యున్నతమైన క్రీడా పోటీలలో ఆటగాళ్లపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించినప్పుడే ఆటగాళ్లు మెడల్స్ సాధించగలుగుతారు.. ఆ ఒత్తిడిని అధిగమించడం వల్లే మిగతా జట్ల ఆటగాళ్లు మెడల్స్ సాధించారు. చైనా, అమెరికా ఆటగాళ్లు మెడల్స్ సాధనలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం ఇదే. ఇవే కాకుండా క్రీడాకారులకు సౌకర్యాలు పెరగాలి. వారు సాధన విధానం మెరుగవ్వాలి. క్రీడాకారులకు మానసికంగా శిక్షణ ఇప్పించాలి. అప్పుడే వారు దృఢంగా తయారవుతారు. లాస్ ఏంజెల్స్ లో రెండంకల మెడల్స్ లక్ష్యం భారత్ నెరవేర్చుకోవాలంటే పైవన్నీ కచ్చితంగా చేయాల్సిందే. వాటన్నింటి కోసం ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ తయారుచేసి.. ఈ నాలుగేళ్లపాటు క్రీడాకారులకు అద్భుతంగా శిక్షణ ఇస్తే భారత జట్టుకు ఇక తిరుగు ఉండదు. 100 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న మన దేశం ఆ స్థాయిలో మెడల్స్ సాధించాలంటే క్రీడల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలి. అప్పుడే విశ్వ క్రీడా యవనికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది.