PNG Vs Uganda: ఐపీఎల్ టి20 క్రికెట్ చరిత్రలో ఉగాండా సంచలనం సృష్టించింది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం గయానా వేదికగా జరిగిన మ్యాచ్లో పపువా న్యూగినియా మీద విజయం సాధించింది.. అయితే ఈ విజయం అంత సులువుగా ఉగాండాకు దక్కలేదు.. స్లో గా ఉన్న ఈ మైదానంపై పపువా న్యూగినియా, ఉగాండా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. మ్యాచ్ చివరి వరకు హోరాహోరీగా సాగింది. ఉత్కంఠ మధ్య జరిగిన ఈ పోటీలో చివరికి ఉగాండా గెలుపును దక్కించుకుంది.
ఉగాండా టాస్ గెలిచి పపువా న్యూగినియా ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.. ఉగాండా బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేయడంతో పపువా న్యూగినియా 19.1 ఓవర్లలో 77 పరుగులకు చాప చుట్టేసింది.. ఈ జట్టులో హిరిహిరి 15, సియాక 12, కిప్లిన్ 12 పరుగులు మాత్రమే చేశారు. మిగతా ఆటగాళ్లు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. అల్పేష్ రంజాని, కాస్మస్, జుమా మియాగి, ఫ్రాంక్ న్సుబుగా తలా రెండు వికెట్లు తీశారు. 43 సంవత్సరాల న్సు బుగా నాలుగు ఓవర్లు వేసి, నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి, రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
ఈ లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన ఉగాండా జట్టు చివరి వరకు పోరాడింది. 18.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది. ప్రారంభంలోనే ఉగాండా తీవ్ర కష్టాలు పడింది. ఒకానొక దశలో 26 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఒక పరుగు చేసి ఒక వికెట్ కోల్పోయిన ఉగాండా, ఆరు పరుగుల వద్ద రెండు, మూడు, 25 పరుగుల వద్ద నాలుగు, 26 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందులో పడింది. ఈ క్రమంలో మ్యాచ్ ఒక్కసారిగా పపువా న్యూగినియా వైపు వెళ్ళిపోయింది.. ఈ దశలో ఉగాండా బ్యాటర్ జుమా మియాగి 13, అలీ షా 33 పరుగులు చేసి, ఒక్కసారిగా మ్యాచ్ ను మలుపు తిప్పారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు ఏకంగా 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తక్కువ పరుగుల వ్యవధిలోనే వీరిద్దరూ ఔట్ కావడంతో మ్యాచ్ మరోసారి పపువా న్యూగినియా చేతుల్లోకి వెళ్ళింది.. అయితే చివరికి ఉగాండా విజయాన్ని దక్కించుకుంది. అద్యంతం ఈ మ్యాచ్ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ ను తలపించింది.. కెన్నెత్ 16 బంతుల్లో ఏడు పరుగులు చేసి అజేయంగా నిలవడంతో ఉగాండా గెలిచింది.