Pawan Kalyan
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయంలో కీలకపాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కూటమి ఏర్పాటు నుంచి ప్రచారం.. ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించే వరరకు అన్నీ తానై వ్యవహించారు. చివరకు కూటమి కోసం సీట్లు కూడా త్యాగం చేశారు. దీంతో పవన్ ప్లాన్ సక్సెస్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. మరోవైపు కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో కూడా టీడీపీ కీలక పాత్ర పోషించనుంది. ఇక, ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జనసేనాని 50 వేలకుపైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. పార్టీ పెట్టిన 15 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
విజయం తర్వాత భార్య కొడుకు సంబురం..
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించడంతో ఆయన భార్య అన్నా లెజ్‌నోవాతోపాటు కొడుకు అకీరా హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో సంబురాలు చేసుకున్నారు. ఇంటికి వచ్చిన పవన్ అభిమానులకు వారు అభివాదం చేశారు. ఫలితాల అనంతరం ఇంటికి వచ్చిన జనసేనానికి భార్య మంగళ హారతి ఇచ్చి, తిలకం దిద్ది స్వాగతం పలికారు.
చంద్రబాబు వద్దకు..
ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేనాని ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు శుభాకంక్షలు తెలుపడంతోపాటు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని దిశానిర్దేశం చేశారు. అనంతరం పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా తన వెంట భార్య అన్నా లెజ్‌నోవాతోపాటు కొడుకు అకిరానందన్‌ను తీసుకెళ్లాడు. అక్కడ చంద్రబాబుకు ముగ్గురూ శుభాకంక్షలు తెలిపారు. తర్వాత పుష్పగుచ్ఛం అందించారు. అకిరానందన్ చంద్రబాబుకు పాదాభివందనం చేశారు.
ప్రధాని వద్దకు కూడా..
ఇక బుధవారం(జూన్ 5)న ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ పక్షాల సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. చంద్రబాబు ఒంటరిగా వెళ్లగా పవన్ కళ్యాణ్ మాత్రం తన భార్య అన్నా లెజ్‌నోవాతోపాటు కొడుకు అకిరానందన్‌ను తీసుకెళ్లారు. సమావేశం అనంతరం పవన్ తన భార్య, కొడుకును ప్రధాని మోదీ వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేశారు. ఈ సందర్భంగా మోదీ కూడా అకిరానందర్‌ను భుజం తట్టి ఆశీర్వదించారు.