Homeక్రీడలు2023 Cricket World Cup: వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ కు ఓకే చెప్పని పాక్.....

2023 Cricket World Cup: వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ కు ఓకే చెప్పని పాక్.. బీసీసీఐపై పగతోనే అలా!

2023 Cricket World Cup: భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ఈ ఏడాది చివరిలో జరగనుంది. ఈ వరల్డ్ కప్ కోసం భారత జట్టు అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సొంత గడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్ ను సాధించి అయినా వరల్డ్ కప్ కలను తీరుస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇందుకోసం భారత జట్టు కూడా సిద్ధమవుతోంది. అయితే, ఈ వరల్డ్ కప్ కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడంలో ఐసీసీ జాప్యం చేస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.

ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ను భారత జట్టు నిర్వహించనుంది. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కావాల్సి ఉంది. అందుకు అనుగుణంగా బీసీసీఐ షెడ్యూల్ మాడ్యూల్ ను తయారుచేసి ఐసీసీకి అందించింది. సదరు షెడ్యూల్ ను ఐసీసీ వరల్డ్ కప్ ఆడునున్న దేశాల క్రికెట్ నియంత్రణ మండలలకు పంపించింది. అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఆయా దేశాలను ఐసిసి అభ్యర్థించింది. అయితే ఇప్పటి వరకు ఏ దేశాల నుంచి అభ్యంతరాలు రాకపోయినప్పటికీ పాకిస్తాన్ బోర్డు సకాలంలో స్పందించకపోవడం వలన షెడ్యూల్ ఆలస్యం అవుతుందని చెబుతున్నారు.

అక్కడ మ్యాచ్ ఆడేందుకు అభ్యంతరం చెబుతున్న పిసిబి..

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇరుదేశాల అభిమానులు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. మ్యాచ్ లైవ్ లో చూసేందుకు వేలాదిగా తరలివస్తుంటారు. అభిమానుల సంఖ్యకు అనుగుణంగా ఎక్కువ మంది చూసేందుకు వీలుగా భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ను గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే, ఇక్కడ మ్యాచ్ ఆడేందుకు పిసిబి ఆసక్తి చూపించడం లేనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ ను పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపించామని, భద్రతా కారణాల దృష్ట్యా గవర్నమెంట్ ఆమోదం పొందిన తర్వాతనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు చెప్పినట్లు తెలుస్తోంది. భారతదేశానికి వెళ్లడంపై ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్లు పిసిబి స్పష్టం చేసిందని ఐసిసి వర్గాలు చెబుతున్నాయి. ఐసీసీ షెడ్యూల్ ను పాకిస్తాన్ బోర్డుకి పంపించి కొద్ది రోజులు గడిచింది. అయితే, మరింత సమయాన్ని కూడా అందించేందుకు ఐసిసి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

గడువులోగా చెప్పకపోతే ఖరారు చేసే అవకాశం..

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఐసీసీ కొంత సమయాన్ని ఇచ్చింది. ఈ సమయంలోగా వేదికకు సంబంధించిన నిర్ణయాన్ని పిసిబి చెప్పాల్సి ఉంది. ఒకవేళ పిసిబి గనుక చెప్పకపోతే ఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ నెలరోజుల కిందటే బీసీసీఐ అధికారులు ఐసీసీకి అందించారు. పాకిస్తాన్ జట్టు నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడానికి గతంలో ఆసియా కప్ విషయంలో బీసీసీఐ చేసిన దానికి పగ తీర్చుకునే ఉద్దేశంతోనే ఇలా చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనకు ఆమోదం కావాలని పిసిబి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఐసిసి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆగస్టు 31 నుంచి ఆసియా కప్ మొదలవుతుందని ఐసిసి ప్రకటించింది. దీంతో ఒక సమస్యకు పరిష్కారం లభించినట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. వరల్డ్ కప్ సంబంధించిన షెడ్యూల్ కు ఐసీసీ కొద్దిరోజుల్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. పాకిస్తాన్ బోర్డు సకాలంలో నిర్ణయం తీసుకున్న తీసుకోకపోయినా ఐసీసీ మాత్రం బీసీసీఐ ఒత్తిడితో షెడ్యూల్ కు ఆమోదం చెప్పే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version