https://oktelugu.com/

PAK vs NZ : చితక్కొట్టిన ఫిలిప్స్.. సొంత గడ్డపై పాకిస్తాన్ కు ఊహించని పరాభవం

మరి కొద్ది రోజుల్లో పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దీనికంటే ముందు పాకిస్తాన్ వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్ జరుగుతోంది. న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు ఈ సిరీస్లో తలపడుతున్నాయి. ఈ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి.

Written By: , Updated On : February 9, 2025 / 08:28 AM IST
Follow us on

PAK vs NZ : శనివారం పాకిస్తాన్ వేదికగా డే అండ్ నైట్ విధానంలో జరిగిన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాభవానికి గురైంది. 78 పరుగుల తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్ ఆటగాడు గ్లేన్ ఫిలిప్స్ మైదానంలో విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ స్కోర్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేయడంతో పాకిస్తాన్ బ్యాటర్లు నిలవలేకపోయారు. ముందుగా ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. గ్లేన్ ఫిలిప్స్ 74 బంతుల్లో ఆరు ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డారిల్ మిచెల్ 84 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 81 పరుగులు చేశాడు. కెన్ విలియంసన్ 89 బంతుల్లో 7 ఫోర్ల సహాయంతో 58 పరుగులు చేశాడు.. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ షా ఆఫ్రిది 3/88, మూడు వికెట్లు తీయగలిగాడు.. అబ్రర్ అహ్మద్ 2/41 రెండు వికెట్లతో అదరగొట్టాడు. హరీష్ రౌఫ్ ఒక వికెట్ పడగొట్టాడు.

న్యూజిలాండ్ జట్టు విధించిన 331 పరుగుల విజయ లక్ష్యాన్ని పాకిస్తాన్ జట్టు ఏ దశలోనూ చేరుకునే విధంగా కనిపించలేదు. న్యూజిలాండ్ బౌలర్లు దూకుడు కొనసాగించడంతో 47.5 ఓవర్లలోనే పాకిస్తాన్ జట్టు 252 పరుగులకు కుప్ప కూలింది.. పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ ఫకార్ జమాన్ 84, సల్మాన్ ఆఘా 40 పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. మిగతా బ్యాటర్లు ఏమాత్రం సత్తా చూపించలేకపోయారు.. పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ (3), బాబర్ అజాం (10) న్యూజిలాండ్ బౌలర్ల ముందు బ్యాట్లెత్తేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, సాంట్నర్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. మైకేల్ బ్రేస్ వెల్ ఒక వికెట్ పడగొట్టాడు. విధ్వంసానికి చిరునామాగా బ్యాటింగ్ చేసిన ఫిలిప్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది.

సొంత మైదానంలో ఆడుతున్నప్పటికీ పాకిస్తాన్ బౌలర్లు తేలిపోయారు. దారుణంగా పరుగులు ఇచ్చారు. అయితే ఫిలిప్స్ ప్రారంభంలో నిదానంగా ఆడాడు. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చదివేగిపోయాడు. ముఖ్యంగా ఆఫ్రిది వేసిన చివరి ఓవర్లో ఫిలిప్స్ రెండు సిక్స్ లు, రెండు ఫోర్ లతో 25 పరుగులు చేశాడు.. తొలి 52 బంతుల్లో 43 పరుగులు చేసిన ఫిలిప్స్.. ఆ తర్వాత వీర విహారం చేశాడు.. 22 బంతుల్లో 63 పరుగులు చేసి ఏకంగా సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ పేస్ బౌలర్ రౌఫ్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర గాయపడ్డారు. బౌలింగ్ వేస్తున్నప్పుడు రౌఫ్ చీలమండ గాయంతో మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు. న్యూజిలాండ్ ఆటగాడు రవీంద్ర కూడా క్యాచ్ పట్టే సమయంలో బంతి నేరుగా ముక్కుకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావం అధికంగా కావడంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక ఆతిధ్య పాకిస్తాన్ జట్టు సోమవారం దక్షిణాఫ్రికా జట్టుతో తదుపరి మ్యాచ్ ఆడనుంది.