Test Cricket : టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెంచే ఉద్దేశంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీని నిర్వహిస్తోంది. తొలిసారిగా 2021లో ఈ టోర్నీని ఐసీసీ నిర్వహించింది. తొలి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో భారత, న్యూజిలాండ్ జట్లు పోటీ పడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టుపై ఘన విజయం సాధించి ఈ టైటిల్ తొలి విజేతగా న్యూజిలాండ్ నిలిచింది. ఈ ఏడాది రెండోసారి ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగానే జరిగింది. రెండోసారి ఫైనల్ కు చేరిన భారత జట్టు ఆస్ట్రేలియా తో ఓవల్ వేదికగా తుది సమరంలో తలపడింది. దురదృష్టవశాత్తు రెండోసారి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమిపాలైంది.
Test Cricket : ఒక్కొక్కరిగా తోపులా.. కలిసి ఆడమంటే తుస్సులు.. ఇదీ భారత ఆటగాళ్ల తీరు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అనేక మ్యాచ్ ల్లో భారత జట్టు గొప్ప విజయాలను నమోదు చేసుకుంటూ ఫైనల్ కు చేరుతోంది. అయితే, ఫైనల్ మ్యాచ్ లో మాత్రం దారుణమైన ఆట తీరుతో భారత జట్టు ఓటమి పాలవుతోంది. ఐసీసీ నిర్వహించిన తొలి రెండు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లోను భారత జట్టు ఓటమిపాలు కావడం గమనార్హం. అయితే, టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీ ఆద్యంతం మాత్రం భారత జట్టు ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నారు. భారీ పరుగులు చేసి వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నారు.
అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021, 2023 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత్ నుంచి ఐదుగురు ఉన్నారు. వీరిలో విరాట్ కోహ్లీ 30 ఇన్నింగ్స్ ల్లో 932 పరుగులు చేయగా, పుజారా 32 ఇన్నింగ్స్ లో 928 పరుగులు చేశాడు. పంత్ 21 ఇన్నింగ్స్ ల్లో 868 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 19 ఇన్నింగ్స్ ల్లో 758 పరుగులు చేశాడు. అలాగే, రవీంద్ర జడేజా 21 ఇన్నింగ్స్ ల్లో 721 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ 10లో నిలిచారు.
సమష్టిగా రాణించలేక చతికిలపడుతూ..
టోర్నీ ఆద్యంతం అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం భారత ఆటగాళ్లు చతికిల పడుతున్నారు. ముఖ్యంగా, సమష్టి ప్రదర్శన కొరవడడంతో జట్టు ఓటమి పాలవుతోంది. కీలక ఆటగాళ్లలో ఒకరు ఆడితే.. మరో ఆటగాడు సరిగా ఆడక పోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. అదే సమయంలో వ్యక్తిగత ప్రదర్శనలకే ఆటగాళ్లు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో జట్టు ప్రదర్శనపై ప్రభావంపై పడుతోంది.