World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌కు సర్వం సన్నద్ధమైంది. మరికొద్ది గంటల్లో తొలి వన్డే ప్రారంభం కాబోతోంది. ఇక ఈ సిరీస్‌కు టీమిండియా సర్వం సిద్ధమైంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు సన్నద్ధమైంది. వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉండి వరల్డ్ కప్ బరిలో దిగుతున్న టీమిండియా ప్రధాన పేసు గుర్రాలు మాంచి ఊపుమీదున్నాయి. గడిచిన కొన్ని దశాబ్దాల్లో టీమ్ ఇండియాకు ఇంత బలమైన పేస్ దళం లభించలేదంటే అతిశయోక్తి కాదు. వీరికి ఆల్ రౌండర్లు తోడవ్వడంతో భారత బ్యాటింగ్ డెప్త్ కూడా పెరిగిపోయింది.
అన్నీ శుభ శకునాలే..
వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గరపడే కొద్దీ టీమ్ ఇండియాకు అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి. గాయాలబారిన పడిన కీలక ఆటగాళ్లు కోలుకొని మంచి లయను అందుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంత బలమైన పేస్ దళం భారత్ తరఫున సిద్ధమైంది. పిచ్ కండీషన్‌ను బట్టి ముగ్గురు నుంచి నలుగురు పేసర్లతో భారత్ బరిలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బుమ్రా, సిరాజ్, షమీ, పాండ్య, శార్దూల్తో కూడిన ప్రపంచంలోనే ‘ది బెస్ట్’ అని చెప్పదగ్గ సీమ్ దళం బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉంది. ఒకప్పుడు ఫాస్ట్ బౌలింగ్ అంటే వెస్టిండీస్ గుర్తుకొచ్చేది. ఆ తర్వాత పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. అద్భుతమైన బౌలర్లను తయారు చేసుకొన్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ స్థాయి బౌలింగ్ను సిద్ధం చేసుకుంది.
హడలెత్తించనున్న ఆసియా బౌలర్…
ముఖ్యంగా పచ్చికతో కళకళలాడే సెనా పిచ్‌లపై సీమర్లు అలవోకగా వికెట్లు సాధిస్తారు. కానీ, బ్యాటింగ్, స్పిన్‌కు అనుకూలించే ఉపఖండం పిచ్‌పై వికెట్లు తీయడం చాలా కష్టం. ఇక్కడ బౌన్స్, సీమ్ రాబట్టడం కత్తిమీద సామే. హేజిల్డ్ వంటి నాణ్యమైన ఆసీస్ బౌలర్ ఈ పిచ్‌లపై 8 ల్లో 6 వికెట్లే తీశాడు. టిమ్ సౌథీ కూడా మ్యాచ్ ఆసియాలో 40 మ్యాచ్‌లు ఆడి కేవలం 58 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా మంది పేసర్లు ఉపఖండం పిచ్లపై చేతులెత్తేశారు. ఇక మన సిరాజ్ వన్డే కెరీర్లో 24 మ్యాచ్‌లలో 43 వికెట్లు తీయగా.. ఉపఖండంపై 17 మ్యాచ్‌ల్లో 35 వికెట్లను కూల్చి ప్రత్యర్థి శిబిరాల్లో ప్రమాదఘంటికలు మోగిస్తున్నాడు. అతడి ఎకానమీ కేవలం 4.5 కావడం విశేషం. ఇక షమీ కెరీర్లో తీసిన 162 వికెట్లలో 64 (39 మ్యాచ్లో) ఆసియా పిచ్‌లపై సాధించినవే. బుమ్రా కూడా కేవలం 37 మ్యాచ్‌లలోనే 4.65 ఎకానమీతో 63 వికెట్లను కూల్చాడు. పాక్ బౌలర్లు షహీన్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్కు కూడా ఆసియా పిచ్‌పై మెరుగైన రికార్డు ఉంది.
పవర్ ప్లేలో భయపెడుతున్న సిరాజ్..!
ఇక జట్టు భారీ స్కోర్లు చేయాలంటే ఓపెనర్లు అద్భుతమైన ప్రారంభాన్ని ఇవ్వడం ముఖ్యం. కానీ, ఇటీవల కాలంలో ప్రత్యర్థి ఓపెనర్లు కుదురుకోనివ్వకుండా భారత్ చేస్తోందంటే… మన పేసర్ల సత్తా ఏమిటో అర్థమవుతుంది. 2022 నుంచి ఇప్పటివరకు టీమ్ ఇండియా ఆడిన 42 ఇన్నింగ్స్ ల్లో మొత్తం 80 వికెట్లను పవర్ ప్లేలోనే కూల్చింది. అంటే ప్రతి మ్యాచ్ సగటున 1.90 వికెట్లు పడగొట్టింది. భారత్ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్ (1.80), న్యూజిలాండ్ (1.70), పాకిస్తాన్(1.70) ఉన్నాయి.
ప్రత్యర్థులకు పీడ కలలా..
హైదరాబాదీ సిరాజ్ ఇటీవల కాలంలో ప్రత్యర్థి ఓ పెనర్లకు పీడకలగా మారాడు. 2022 నుంచి అతడు పవర్ ప్లేలో మొత్తం 132 ఓవర్లు వేసి.. 32 వికెట్లు తీశాడు. అంతేకాదు.. పొదుపుగా 4.16 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. 2023లో అయితే 13 ఇన్నింగ్స్‌లో 16 వికెట్లు తీశాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక ఇన్నింగ్స్ పవర్ ప్లేలోనే పేకమేడలా కూల్చేశాడు.
వరల్డ్ కప్‌లో తిరుగులేని బుమ్రా..
మరో పేసర్ షమీ హ్యాట్రిక్ వరల్డ్ కప్‌కు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది షమీ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. మొత్తం 12 ఇన్నింగ్స్ ఆడి.. 19 వికెట్లను కూల్చాడు. వీటిల్లో తన కెరీర్లోనే అత్యున్నత గణాంకాలైన 5/51ని దేశీయ పిచ్ మీద ఆస్ట్రేలియాపై నమోదు చేశాడు. ముఖ్యంగా షమీ గత ప్రపంచకప్లో భారత్ తరఫున అద్భుత బౌలి గణాంకాలను నమోదు చేశాడు. 2015, 2019 ప్రపంచకప్ ఆడి మొత్తం 11 మ్యాచ్‌లలో 31 మంది బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. ప్రపంచకప్ టోర్నీలో అతడి బెస్ట్ 5/69. వాస్తవానికి షమీ బౌలింగ్ యావరేజి 25.50. కానీ, ప్రపంచకప్లో అద్భుతంగా రాణించి కేవలం 15.70 సగటును నమోదు చేశాడంటే అతడి బౌలింగ్ పదును అర్థం చేసుకోవచ్చు. 2019 మెగా టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి.. 18 వికెట్లను కుప్పకూల్చాడు. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికాపై విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో బుమ్రా కెరీర్ సగటు 20గా ఉంది. అతని మొత్తం కెరీర్ సగటు రేటు 24.31 కావడం గమనార్హం.
పెరిగిన బ్యాటింగ్ బలం..
మన సీమర్ల గణాంకాలు విశ్లేషకులను పునరాలోచనలో పడేస్తున్నాయి. మూడో స్పెషలిస్టు పేసర్‌ను కూడా జట్టులో ఉంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే హార్డిక్ రూపంలో మీడియం పేస్ ఆల్‌రౌంర్ జట్టులో ఉండనే ఉన్నాడు. దీంతో స్పెషలిస్టు సీమర్లలో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేసి మరో స్పెషలిస్టు బ్యాటర్‌కు అవకాశం కల్పించే వెసులుబాటు రోహిత్‌కు లభిస్తుంది.
పిచ్ స్వింగ్‌కు అనుకూలిస్తుంది..
ముగ్గురు స్పెషలిస్టు సీమర్లను బరిలోకి దించినా.. ఐదుగురు స్పెషలిస్టు బ్యాటర్లు ఉంటారు. ఇక మిడిల్, లోయర్ ఆర్డర్‌ను బలోపేతం చేయడానికి ఆల్ రౌండర్స్ ఉంటారు. పేసర్లు కూడా చివర్లో తనదైన శైలిలో హార్డ్ హిట్టింగ్ చేస్తే.. ఆఖరి బ్యాటర్ వరకు పరుగులు సాధించే అవకాశం ఉంది.