Duleep Trophy : దులీప్ ట్రోఫీ అనంతపురంలో ఎందుకు నిర్వహిస్తున్నారో ఇప్పుడు తెలిసిపోయింది..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో త్వరలో దులీప్ ట్రోఫీ నిర్వహించనున్నారు.. ఈ ట్రోఫీలో ఆడేందుకు స్టార్ క్రికెటర్లు రానున్నారు..దులీప్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్ లు ఇక్కడే నిర్వహించనున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 2, 2024 4:52 pm

Duleep Trophy in Ananthapur

Follow us on

Duleep Trophy : సెప్టెంబర్ 5 నుంచి అనంతపురంలో దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈసారి స్టార్ ఆటగాళ్లు రావడంతో ఈ దేశవాళీ ట్రోఫీకి విపరీతమైన క్రేజ్ పెరిగింది. బుమ్రా, విరాట్ కోహ్లీ, రోహిత్ మినహా మిగతా వారంతా ఈ టోర్నీలో ఆడనున్నారు. ఇప్పటికే బీసీసీఐ నాలుగు జట్లను ప్రకటించింది. దులీప్ ట్రోఫీకి బెంగళూరు, అనంతపురం మైదానాలను సిద్ధం చేసింది. అయితే చాలామంది అనంతపురం స్టేడియం అనగానే ముక్కున వేలేసుకున్నారు. ఇదేంటి ఈ మైదానంలో క్రికెట్ టోర్నీ ఎలా నిర్వహిస్తారని అందరూ ప్రశ్నించారు. అయితే అనంతపురం మైదానం సదుపాయాల విషయంలో ఏ మాత్రం తక్కువ కాదు. ఈ మైదానం బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా అనుకూలంగా ఉంటుంది. ఈ మైదానాన్ని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ సంఘం పరోక్షంగా మద్దతు ఇస్తోంది.. అయితే అనంతపురంలోని ఈ మైదానం ఆస్ట్రేలియాలోని పెర్త్ పిచ్ ను పోలి ఉంటుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి..

పేస్ బౌలర్ల హవా

అనంతపురం మైదానంలో 2004 నుంచి 2013 వరకు 15 మ్యాచ్ (నాలుగు రోజులపాటు) లు నిర్వహించారు.ఈ మైదానంపై పేస్ బౌలర్లు 345, స్పిన్నర్లు 96 వికెట్లు పడగొట్టారు. మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియా దేశంలో టీమిండియా పర్యటించనుంది. ఒకవేళ ఈ మైదానంపై కనుక మన బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేస్తే.. ఆస్ట్రేలియా పిచ్ లపై సత్తా చాటడానికి అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా దేశంలోని పెర్త్, ఆడి లైడ్, సిడ్నీ మైదానాలు పేస్ బౌలర్లకు స్వర్గధామంగా ఉంటాయి. క్రీజ్ లో కుదురుకుంటే చాలు ఆటగాళ్లు మెరుగ్గా పరుగులు చేయొచ్చు.. అనంతపురం మైదానంలోనూ అలాంటి పరిస్థితులే ఉంటాయి. ఈ మైదానంపై ఒక జట్టు 100 పరుగులకే ఆల్ అవుట్ అయింది. బ్యాటర్లు నాలుగు సార్లు మాత్రమే 400 పైగా పరుగులు చేయగలిగారు.

20 సంవత్సరాల క్రితం ఏర్పాటు

అనంతపురంలో ఈ మైదానాన్ని 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని మిగతా జిల్లాలు దీనిని ఆదర్శంగా తీసుకొని ఆయా ప్రాంతాలలో మైదానాలు ఏర్పాటు చేశాయి.. క్రికెట్ ను అభివృద్ధి విభాగంలోకి చేర్చేందుకు దేశంలో తొలిసారి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపురంలో ప్రయత్నించింది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ మైదానం ఏర్పాటు చేసిన నాటి నుంచి అనంతపురంలో నిత్యం క్రికెట్ మ్యాచ్ లు జరుగుతూనే ఉన్నాయి.. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ మ్యాచ్ లు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇక్కడ టోర్నీలో నిర్వహిస్తున్నారు.. మరోవైపు సెప్టెంబర్ ఐదు నుంచి ఇండియా సీ, ఇండియా డీ టీమ్ లు తెలపడనున్నాయి. ఇండియా సీ జట్టుకు రుతు రాజ్ గైక్వాడ్, ఇండియా డీ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నారు.

Tags