https://oktelugu.com/

AP Flood : ఏపీ వరద కష్టాలు.. ఆటో, కార్లు, బస్సులు పనిచేయవు.. ‘బోటు’కు రూ.4వేలు

చుట్టూ నీరు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే భయం భయం. ఇటువంటి క్రమంలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని భావిస్తున్న ప్రజలకు రవాణా కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని బోటు యజమానులు దందాకు పాల్పడుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : September 2, 2024 5:02 pm
    Fraud by boat owners

    Fraud by boat owners

    Follow us on

    AP Flood  : ఏపీని వర్షాలు ముంచేశాయి.వర్ష బీభత్సంతో విజయవాడ నగరం పూర్తిగా నీట మునిగింది. చాలా ప్రాంతాల్లో నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది.కొన్ని ప్రాంతాలకు బయట ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే ఇప్పుడు బోటు తప్పనిసరి.ఆటోలు,బస్సులు, కార్లు ఉన్నా ఎందుకు పనికిరావు. ఇప్పుడు బోటు ఉన్న వారే లక్షాధికారి అన్నట్టు అక్కడ పరిస్థితి మారింది. అయితే బోట్లకు విపరీతంగా గిరాకీ ఏర్పడింది. దీంతో ప్రైవేట్ బోటు యజమానులు దందాకు తెర తీశారు.సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 1500 రూపాయల నుంచి 4 వేల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.అయితే ఇంతటి ఆపద సమయంలో డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బోటు యజమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో.. ఇంకా విజయవాడ నగరంలో ముంపు తెగడం లేదు. నేటి సాయంత్రానికి సాధారణ పరిస్థితులు వస్తాయని భావించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని ప్రాంతాలు ఇంకా ముంపు బారిన ఉన్నాయి.

    * ఒకవైపు సహాయ చర్యలు
    ప్రభుత్వం సహాయ చర్యలను పెంచింది. పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను అందిస్తోంది. అయితే ముంపు ప్రాంతాల్లో బాధితులు ఇంటి నుంచి అడుగు పెట్టాలంటే బోటు అవసరం. అందుకే బోట్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. అయితే కృష్ణా నది పరిహవాక ప్రాంతాల్లో బోటు వినియోగం అధికం. ఇప్పుడు ఆ బోటు యజమానులంతా విజయవాడ నగరంపై దృష్టి పెట్టారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఎక్కువ మంది వారు అడిగినంత చెల్లించి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.

    * ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రాక
    మరోవైపు విజయవాడ నగరానికి భారీగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. తమిళనాడు నుంచి మూడు, పంజాబ్ నుంచి నాలుగు, ఒడిస్సా నుంచి మూడు ఎన్టీఆర్ బృందాలు వచ్చాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో వారు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్, పది ఎస్ టి ఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. నేవీ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. హెలికాప్టర్ల ద్వారా వాయు మార్గంలో సేవలందిస్తున్నాయి. ఈరోజు మరో నాలుగు హెలికాప్టర్లు అందుబాటులోకి వచ్చాయి.

    * ప్రత్యేక శిబిరాలకు తరలింపు
    వరద తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి బాధితులను ఎన్డిఆర్ఎఫ్ బృందాలు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నాయి. విజయవాడ నగరంలో కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ హాళ్లను శిబిరాల కోసం వినియోగిస్తున్నారు. సీఎం చంద్రబాబు తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా విజయవాడ కలెక్టరేట్ నుండే పాలన సాగిస్తున్నారు. విజయవాడ నగరం యధాస్థితికి వచ్చేవరకు సహాయ చర్యలు కొనసాగుతాయని ప్రభుత్వం చెబుతోంది.