IND Vs BAN Test : టీమిండియా 1932 జూన్ 25న తొట్ట తొలిసారిగా క్రికెట్ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 92 సంవత్సరాల తర్వాత చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో భారత్ టెస్ట్ ఆడుతున్న నేపథ్యంలో అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 23 భారత క్రికెట్ చరిత్రలో అద్భుతమైన జ్ఞాపకం గా రూపాంతరం చెందనుంది. సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు బంగ్లా – భారత్ మధ్య తొలి టెస్ట్ జరుగుతుంది. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు అరుదైన ఘనతను సాధించనుంది. తొలి టెస్ట్ లో భారత్ విజయం సాధిస్తే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరాజయాల కంటే విజయాలు సాధించిన జట్టుగా భారత్ చరిత్రలో నిలిచిపోతుంది. 1932 నుంచి భారత జట్టు క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది. 1952లో.. దాదాపు 20 సంవత్సరాలు తర్వాత ఇంగ్లాండ్ జట్టుపై భారత్ తొలి విజయాన్ని దక్కించుకుంది. ఆ విజయానికి చెన్నైలోని చిదంబరం మైదానం వేదికయింది. దాదాపు 92 సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ 19న మొదలవనున్న భారత్ – బంగ్లా టెస్ట్ సిరీస్ కూడా అదే స్టేడియంలో జరగడం విశేషం.
విజయాల బాట
1988 వరకు భారత జట్టు ఒక ఏడాది కూడా ఎక్కువ శాతం విజయాలతో ముగించలేదు. 2009లో భారత జట్టు 100వ టెస్ట్ మ్యాచ్లో గెలుపును సొంతం చేసుకుంది. అప్పటికి 432 టెస్ట్ మ్యాచ్ లు ఆడినప్పటికీ.. భారత జట్టు గెలుపు శాతం కేవలం 23.14 శాతం మాత్రమే.. అంటే నాలుగు మ్యాచ్ లు ఆడితే ఒకదాంట్లో కూడా గెలవలేని దుస్థితి. ఆ తర్వాత గత 15 సంవత్సరాల లో భారత క్రికెట్ జట్టులో సమూలమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ 15 సంవత్సరాలలో భారత్ 147 మ్యాచ్ లు ఆడింది. 79 మ్యాచ్ లలో విజయాన్ని సొంతం చేసుకుంది. గెలుపు శాతాన్ని 53.06కి పెంచుకుంది. భారత జట్టు ఇప్పటి వరకు 579 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. ఇందులో విజయాలు(178), అపజయాలు(178) సమానంగా ఉన్నాయి. ఇందులో భారత్ 222 మ్యాచ్ లను డ్రా చేసుకుంది.
బంగ్లా తో టెస్ట్ విజయం అందుకే ముఖ్యం
బంగ్లా జట్టుతో జరిగే మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన నాలుగవ జట్టుగా టీమిండియా ఆవిర్భవిస్తుంది. ఒకవేళ అయిదు విజయాలు సొంతం చేసుకుంటే టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన మూడవ జట్టుగా చరిత్ర పుటల్లో నిలుస్తుంది.
36 మంది కెప్టెన్లు
భారత టెస్ట్ క్రికెట్ ప్రయాణంలో 36 మంది కెప్టెన్లుగా పనిచేశారు. సీకే నాయుడు మొదటి కెప్టెన్ గా భారత జట్టును నడిపించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. 92 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో 314 క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. 1932లో జూన్ 25న అమర్ సింగ్ అనే ఆటగాడు లండన్ లో తొలి టీమిండియా టోపీ అందుకున్నాడు. 2024లో మార్చి 27 ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్టులో దేవదత్ పడిక్కల్ చివరిసారిగా టీమిండియా టోపీ అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చేతుల మీదుగా అందుకున్నాడు.