Nicholas Pooran : టి20 క్రికెట్ చూసే వాళ్ళకి నికోలస్ పూరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు శివతాండవం చేసినట్టు బ్యాటింగ్ చేస్తాడు. బౌలర్లకు పీడకలలు మిగుల్చుతాడు. బీభత్సమైన బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టిస్తాడు. ఎలాంటి బౌలర్ నైనా అతడు ఎదుర్కొంటాడు. తనకు మాత్రమే సాధ్యమైన భీకరమైన బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తుంటాడు. అందువల్లే టి20 లలో అనేక రికార్డులను తన పాదాక్రాంతం చేసుకున్నాడు. తాజాగా మరో ఘనతను తన పేరుమీద లిఖించుకున్నాడు..
ప్రస్తుతం వెస్టిండీస్ దేశంలో కరేబియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్ లో ట్రిన్ బాగో జట్టు తరఫున పూరన్ ఆడుతున్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో టి20 క్రికెట్లో సరికొత్త రికార్డును సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్ గా బెంచ్ మార్క్ సృష్టించాడు. శుక్రవారం బార్బడోస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పూరన్ కేవలం 15 బంతులు మాత్రమే ఎదుర్కొని 27 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మహమ్మద్ రిజ్వాన్ (2,016 రన్స్, 45 ఇన్నింగ్స్ -2021) రికార్డును బద్దలు కొట్టాడు. పూరన్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 65 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. 2,059 రన్స్ చేశాడు. ఈ ఏడాది అతడు టి20 క్రికెట్ ను వెస్టిండీస్, డర్బన్ సూపర్ జెయింట్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ న్యూయార్క్, నర్తన సూపర్ ఛార్జర్స్, రంగ్ పూర్ రైడర్స్, ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్ల తరఫున ఆడాడు . ఇందులో అతడు 14 అర్థ సెంచరీలు చేశాడు. 90 కి పైగా పరుగులను రెండుసార్లకు పైగా చేశాడు.. ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడం వల్లే అతని పేరు టి20 ఫార్మాట్ లో మారు మోగిపోతుంది. ఇదే సమయంలో అనేక దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను పూరన్ బద్దలు కొట్టాడు. నికోలస్ పూరన్ 65 ఇన్నింగ్స్ లలో 2,059 రన్స్ చేశాడు. మహమ్మద్ రిజ్వాన్ 2021లో 2,036 రన్స్ చేశాడు. ఇందుకుగానూ అతడు 45 ఇన్నింగ్స్ లు ఆడాడు. అలెక్స్ హేల్స్ 2022 లో 61 ఇన్నింగ్స్ లలో 1,946 రన్స్ చేశాడు. జోస్ బట్లర్ 2023లో 55 ఇన్నింగ్స్ లలో 1,833 పరుగులు చేశాడు.. మహమ్మద్ రిజ్వాన్ 2022లో 44 ఇన్నింగ్స్ లలో 1,817 రన్స్ చేశాడు.