Teja Nidamanuru: ఐపీఎల్‌తో టాలెంట్ ఉన్న క్రికెటర్లను ఫ్రాంచైజీలు వెతికి పట్టుకుంటున్నాయి. చిన్న దేశమా.. పెద్ద దేశమా అని ఆలోచన చేయకుండా దూకుడుగా ఆడే క్రికెటర్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ ›ఫ్రాంచైజీల కళ్లు మరో తెలుగు కుర్రాడిపై పడ్డాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య ఇప్పటికే ఆ తెలుగు కుర్రాడిని కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరీ తెలుగు కుర్రాడు.. ఎందుకంత క్రేజ్ అంటే..
వరల్డ్ కప్ క్యాలిఫైయింగ్‌లో సత్తా..
అది వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్. వెస్టిండీస్ నెదర్లాండ్స్ మధ్య జరుగుతుంది. అప్పటికే పసికూన నెదర్లాండ్స్ ముందు 375 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది వెస్టిండీస్. పసికూనలు ఏం గెలుస్తారులే అని డచ్ టీమ్‌ను తక్కువగా అంచనా వేశారు. కానీ ఇది క్రికెట్.. ఏ బంతికి ఎలాంటి అద్భుతం జరుగుతుందో చెప్పలేం. అలాంటి అద్భుతమే నెదర్లాండ్స్ చేసింది. మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లినప్పటికీ.. అంతకుముందు మ్యాచ్ టై అవడానికి తెలుగు కుర్రాడు నిడమనూరు తేజ డచ్ టీమ్ తరఫున వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఎవరీ తేజ…
ఇంతకీ ఎవరు ఈ తేజ.. ఏమిటి ఇతని నేపథ్యం..? కరేబియన్ జట్టు విధించిన 375 పరుగులను ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ జట్టు చతికిలపడింది. సరిగ్గా అప్పుడే ఎంటర్ అయ్యాడు మన తెలుగు ‘తేజ’ం. 22వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన తేజ 46వ ఓవర్ వరకూ క్రీజ్‌లో ఉండి 76 బంతుల్లో 111 పరగులు చేసి ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు. దీంతో నెటిజెన్లు తేజ ఎవరు అంటూ ఇంటర్నెట్‌లో వెతకటం ప్రారంభించారు. తేజ నిడమనూరు.. ఈ పేరులోనే తెలిసిపోతుంది ఈ కుర్రాడు తెలుగువాడని. ఇతని సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ. 1994 ఆగస్టు 22న జన్మించిన ఇతని పూర్తి పేరు అనిల్‌తేజ నిడమనూరు.
ఇండియా టూ నెదర్లాండ్స్ వయా న్యూజిలాండ్
బాల్యంలోనే తన కుటుంబం విజయవాడ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లింది. అక్కడే క్రికెట్ పాఠాలు నేర్చుకున్న తేజ.. ఆక్లాండ్ జట్టు తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. అయితే న్యూజిలాండ్ కుర్రాడు నెదర్లాండ్స్ జట్టుకు ఎలా ఆడాడంటే న్యూజిలాండ్‌లో చదువుకున్న తేజకు.. డచ్ దేశంలో ఉద్యోగం వచ్చింది. న్యూజిలాండ్ నుంచి నెదర్లాండ్స్‌కు వచ్చినప్పటికీ తను ఎంతగానో ఇష్టపడే క్రికెట్‌ను మాత్రం మరువలేదు. దీంతో డచ్‌లోని ఉట్రెక్ట్‌లోని కంపాంగ్ క్లబ్‌లో జాయిన్ అయ్యాడు. ఇలా డచ్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్న తేజకు ఒక్కసారిగా ఆ దేశం తరఫున ఆడాల్సిందిగా పిలుపొచ్చింది.
తేజ కోసం క్రికెట్ క్లబ్‌ల పోటీ..
క్రికెట్ క్లబ్స్ నెదర్లాండ్స్ తరపున మంచి ప్రదర్శన కనబరుస్తున్న తేజపై ఇతర దేశాలకు చెందిన క్రికెట్ క్లబ్స్ కళ్లు పడ్డాయి. ఈ కుర్రాడి కోసం పోటీపడ్డాయి. దీంతో ఇంగ్లాండ్‌లో క్లబ్ కోసం తేజ ఆడటం ప్రారంభించాడు. ఇక్కడే ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌తో పరిచయమైంది. ఇద్దరూ ఒకే క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించారు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ కంటే ముందు అదే వెస్టిండీస్‌తో వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తేజ.. తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్ నెదర్లాండ్స్ ఓడినప్పటికీ తన బ్యాటింగ్‌తో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.
వరల్డ్ కప్ క్వాలిఫైయర్‌కు ముందు..
ఇక వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌కు ముందు నెదర్లాండ్స్ జట్టు జింబాబ్వేతో మూడు వన్డేల సీడబ్ల్యూసీ సూపర్ లీగ్ సిరీస్ ఆడింది. అందులో తొలి వన్డేలో 110 బంతుల్లో 96 పరుగులు చేసి డచ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు తేజ. 250 పరుగుల టార్గెట్ విధించిన జింబాబ్వే తప్పక గెలుస్తారని భావించారు. కానీ 7వ నంబర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన తేజ జట్టును గెలిపించి అందరి అంచనాలను తలకిందులు చేశాడు. దీంతో ఏడవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అంతటి స్కోరు చేసిన వారిలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, అబ్దుల్ రజాక్ రికార్డులను తేజ చెరిపివేశాడు.
వెస్టిండీస్‌పై సెంచరీ..
ఇక వెస్టిండీస్‌పై సెంచరీతో తేజ కదం తొక్కడంతో అందరి కళ్లు ఈ కుర్రాడిపై పడ్డాయి. ముఖ్యంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఈ కుర్రాడి గురించి ఆరా తీస్తున్నాయి. ఎంత డబ్బు అయినా సరే ఈ కుర్రాడిపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ జట్టు యజమాని కావ్యాపాప తేజను ఎలాగైనా సరే కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇతర బడా ఫ్రాంచైజీలు కూడా తేజ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మొత్తంగా తేజకు గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.