Ramoji Rao- Jagan: ఎల్లో మీడియా శాపనార్థలే జగన్ కు శ్రీరామరక్షగా మారుతున్నాయి. మీడియా అధినేతలకు మించి వారు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబుకు మించి జగన్ తో తలపడుతున్నారు. తామే ప్రత్యర్థి అన్న తరహాలో వ్యవహరిస్తున్నారు. పైకి అక్షర యుద్ధం చేస్తున్నా.. తెర వెనుక మాత్రం రాజకీయం దాగి ఉందన్న నిర్ధారణకు సామాన్య జనాలు వస్తున్నారు. ఈ క్రమంలో వారు నిజాలు రాస్తున్నా అరణ్య రోధనగా మిగులుతోంది. అయిన దానికి.. కానిదానికి వారు రాస్తున్నరోత రాతలతో ప్రజోపయోగం కోసం రాసిన రాతలు సైతం ఎవరికీ పట్టకుండా పోతున్నాయి.
రాజధాని అమరావతిలో సుమారు 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో జగన్ ఉద్దేశ్యం వేరు. బయటకు చెబుతోంది వేరు. కానీ అక్కడ లబ్ధి పొందేది మాత్రం పేదలే. కానీ జగన్ ఉద్దేశ్యాన్ని బయటపెట్టే క్రమంలో మాత్రం ఎల్లో మీడియా దోషిగా నిలబడుతోంది. అమరావతిని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నంలోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని నిర్మాణాలను అటకెక్కించారు. అక్కడ ఉన్న భూములను లీజుకివ్వడమో.. లేకుంటే విక్రయించడమో చేయాలని చూశారు. కానీ అది కుదర్లేదు. అందుకే పేదలను అడ్డం పెట్టుకొని ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీనికి న్యాయస్థానం సైతం పచ్చజెండా ఊపింది.
అయితే జగన్ ఇలా పంపిణీ చేసిన పట్టాలకు సంబంధించి ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 47 వేల ఇళ్లకు సెంట్రల్ శాంక్షనింగ్ మోనటరింగ్ కమిటీ అనుమతులిచ్చింది. మిగతా వాటికి తరువాత సమావేశంలో అనుమతులిస్తామని పేర్కొంది. ఈ 47 వేల ఇళ్లకు సంబంధించి రూ.1.50 లక్షల లెక్కన రూ.705 కోట్ల వ్యయం కానుంది. అయితే అమరావతిలో పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించి కోర్టులో వచ్చింది ప్రాథమిక తీర్పేనని.. తుది తీర్పు లబ్ధిదారులకు వ్యతిరేకంగా వస్తే కేంద్రం అందించే రూ.705 కోట్ల నిధులు వృథా అవుతాయని ఈనాడులో ప్రత్యేక కథనం వచ్చింది. అయితే ఇది కొంత సహేతుకంగానే ఉంది.
కానీ ఈనాడు కథనం అంతటితో ఆగలేదు. నెలరోజుల్లో ఆగమేఘాల మీద అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించడం మాత్రం తప్పు. జగన్ అడిగిందే తడవుగా ఆమోదించడం ఏంటని ప్రశ్నించడం మాత్రం లోలోపల ఉన్న రాజకీయ ఆవేదనను తెలియజేస్తోంది. బాధ్యతాయుతమైన మీడియాగా అక్కడ జరుగుతున్న తప్పొప్పులను వివరించడం చేయాలి. రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవడాన్ని స్వాగతించాలి. కానీ అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్టు జగన్ విషయంలో మొండిగా వ్యవహరిస్తుండడం మాత్రం సహేతుకం కాదు. అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపించినట్టవుతుంది. ఒక బాధ్యతాయుతమైన మీడియా తనను తాను తగ్గించుకోవడం అవుతోంది. ఓ రాజగురువుగా, మీడియా మొఘల్ గా రామోజీరావుకు తెలియని విషయం కాదు. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం.