https://oktelugu.com/

Neeraj Chopra : చెయ్యి విరిగి.. భరించలేని నొప్పి.. అయినా నీరజ్ ఈటెను విసిరాడు.. ఒలింపిక్ ఛాంపియన్ నీకు సలాం

అతడి చెయ్యి విరిగింది. అతడి స్థానంలో ఇంకో ఆటగాడు ఉంటే కచ్చితంగా విశ్రాంతి తీసుకునేవాడు. కానీ అతడు అలా కాదు. నొప్పి ఇబ్బంది పెడుతున్నా.. భరించలేని బాధ నరకం చూపిస్తున్నా బరిలో ఉన్నాడు.. విరిగిన చేత్తోనే ఈటను విసిరాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 15, 2024 / 09:40 PM IST

    Neeraj Chopra

    Follow us on

    Neeraj Chopra : జావెలిన్ త్రో లో డైమండ్ లీగ్ మీట్ ను ప్రతిష్టాత్మక టోర్నీగా భావిస్తుంటారు.. ఈ టోర్నీలో భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా సెంటీమీటర్ తేడాతో టైటిల్ కోల్పోయాడు..0.01 మీటర్ల తేడాతో రన్నరప్ గా మిగిలాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ పోటీ నిర్వహించారు. నీరజ్ చోప్రా తన ఈటెను 87.86 మీటర్ల దూరం విసిరాడు. అంతకుముందు రెండు ప్రయత్నాలలో మామూలుగానే ఈటె విసిరిన అతడు.. మూడో ప్రయత్నంలో ఈ ఘనతను సాధించాడు. అయితే ఈ పోటీలలో నీరజ్ చోప్రా చేయి విరిగినప్పటికీ.. పాల్గొన్నాడు. ఇటీవల సాధన మొదలు పెడుతుండగా అతని ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది. దీంతో అతడు చికిత్స పొందాడు. ఆ బాధ ఇంకా తగ్గలేదు. ఆ నొప్పి అతడిని ఇబ్బంది పెడుతూనే ఉంది. అయినప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఈటె విసిరాడు. ఇదే విషయాన్ని నీరజ్ చోప్రా ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

    తిరిగి చూసుకుంటున్నాను

    ” 2024 సీజన్ ముగింపు దశకు వచ్చింది. ఈ క్రమంలో సాధించిన పురోగతిని తడమి చూసుకుంటున్నాను. ఎదుర్కొన్న ఎదురు దెబ్బలను తిరిగి చూస్తున్నాను. మానసిక స్థైర్యాన్ని పొందుతున్నాను. గత సోమవారం శిక్షణ చేస్తుండగా గాయపడ్డాను. డాక్టర్లు స్కానింగ్ చేశారు. నా ఎడమ చేయి ఫ్రాక్చర్ అయిందని తెలిపారు. ఇది నాకు చాలా ఇబ్బందికరమైన పరిణామం. నా బృందం సహాయంతో బ్రస్సెల్ లోకి ప్రవేశించాను. ఇక్కడ జరిగే పోటీలో పాల్గొన్నారు. జావెలిన్ త్రో కు సంబంధించి ఈ ఏడాదిలో నాకు ఇది చివరి పోటీ. ఎడమ చేయి ఫ్రాక్చర్ కావడం వల్ల ఇబ్బంది ఎదురయింది. కాకపోతే దాన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. అంచనాలను రీచ్ కాకపోయినప్పటికీ నా పూర్తిస్థాయి ప్రదర్శనను త్వరలోనే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. ఈ ఏడాది నాకు చాలా నేర్పింది. మంచి అథ్లెట్ ను చేసింది. వచ్చే ఏడాది కలుద్దామని” నీరజ్ చోప్రా ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

    ఛాంపియన్ అతడే

    బ్రస్సెల్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ లో గ్రెనెడా దేశానికి చెందిన అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. ఫలితంగా చాంపియన్ గా నిలిచాడు.. ఇటీవలి పారిస్ ఒలింపిక్స్ లో అండర్సన్ కాంస్యం దక్కించుకున్నాడు. ఒలింపిక్స్ లో వెండి పతకం సాధించిన నీరజ్ చోప్రా సెంటిమీటర్ తేడాతో టైటిల్ కోల్పోయాడు. దీంతో నీరజ్ చోప్రా అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. నీరజ్ చెయ్యి ఫ్రాక్చర్ కాకుండా ఉండి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు.