IND vs BAN: శ్రీలంక టోర్నీ తర్వాత టీమిండియా కు 45 రోజుల విరామం లభించింది. ఈ నేపథ్యంలో స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో భారత్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి ఈ సిరీస్ మొదలవుతుంది. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. సెప్టెంబర్ 27 నుంచి 2వ టెస్ట్ మొదలవుతుంది. రెండవ టెస్ట్ కాన్పూర్ వేదికగా జరుగుతుంది. ఈ సిరీ క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. తద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకోవాలనే కృత నిశ్చయంతో ఉంది వాస్తవానికి స్వదేశంలో భారత జట్టును ఓడించే ధైర్యం బలమైన జట్లకే లేవు. జనవరిలో భారత జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడిన ఇంగ్లాండ్ పరువు పోగొట్టుకుని వెళ్ళింది. అలాంటిది బలమైన రోహిత్ సేనను వడగొట్టాలంటే బంగ్లాదేశ్ జట్టుకు అంత సులభం కాదు. అయితే బంగ్లాదేశ్ జట్టు ఇటీవల పాకిస్తాన్ ను వారి స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో ఓడించింది. అదే ఊపులో భారత జట్టును కూడా ఓడిస్తామని బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో వ్యాఖ్యానిస్తున్నాడు. భారత జట్టును ఇబ్బంది పెట్టడానికి తమ వద్ద అద్భుతమైన బౌలింగ్ ఆయుధం ఉందని చెబుతున్నాడు. ఇంతకీ ఆయుధం ఎవరని పరిశీలిస్తే.. అతడు 21 ఏళ్ల కుర్రాడు నహీద్ రాణా అని తేలింది.
పాక్ పై ప్రతాపం
పాకిస్తాన్ జట్టుతో జరిగిన రెండు టెస్టుల్లో రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా బాబర్ అజాం, షాన్ మసూద్, సాద్ షకీల్ వంటి ఆటగాళ్లను అవుట్ చేశాడు. 140+ కిలోమీటర్ల వేగంతో స్థిరంగా బంతులు విసురుతున్నాడు. ఒక్కోసారి 150 కిలోమీటర్ల వేగంతోనూ బంతులను సంధిస్తున్నాడు. పైగా అతడు 6.2 అడుగుల ఎత్తు ఉన్నాడు. 2020లో రాణా క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. ఏడాది అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మూడు టెస్టులు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. 18 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లలో 74 వికెట్లు సాధించాడు.. 10 లిస్ట్ – ఏ మ్యాచ్ లలో 26 వికెట్లు సొంతం చేసుకున్నాడు. అందుకే ఇతడిని తన బలం అని బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో అంటున్నాడు. మరోవైపు ఇతడిని ఎదుర్కొనేందుకు భారత ఆటగాళ్లు ప్రణాళికలు రూపొందించారు. చెన్నైలో నెట్స్ లో సాధన చేస్తున్నారు. రాణా లాగే అంత ఎత్తున్న పంజాబ్ పేస్ బౌలర్ గుర్నూర్ బ్రార్ తో బౌలింగ్ వేయించుకొని.. భారత బ్యాటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.