Homeక్రీడలుMumbai Indians: ప్లే ఆఫా పాడా.. మీ గల్లి స్థాయి ఆటకు.. చివరి మ్యాచ్ లు...

Mumbai Indians: ప్లే ఆఫా పాడా.. మీ గల్లి స్థాయి ఆటకు.. చివరి మ్యాచ్ లు గెలిస్తేనే గొప్ప..

Mumbai Indians: “ఐదుసార్లు కప్ గెలిచింది. గత సీజన్లలో అంతంత మాత్రంగానే ఆడింది. ఈసారి చూడండి దుమ్ము దులుపుతుంది. దెబ్బతిన్న బెబ్బులి లాగా విరుచుకుపడుతుంది. కచ్చితంగా కప్ గెలుస్తుంది. ఆరోసారి ఐపీఎల్ ట్రోఫీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది”. ఐపీఎల్ ప్రారంభానికి ముందు.. ముంబై జట్టుపై అభిమానులకు ఉన్న ఆశలవి. కానీ, ఆ ఆశలను ముంబై జట్టు ఆటగాళ్లు అడియాసలు చేశారు.. రోహిత్ శర్మ నుంచి హార్థిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చి ముంబై జట్టు యాజమాన్యం సగం తప్పు చేస్తే.. వర్గాలుగా విడిపోయి.. ఆట తీరు సరిగా లేక.. ప్లేయర్లు మిగతా సగం తప్పును పూర్తి చేశారు. ఫలితంగా ముంబై ఇండియన్స్ అనామక జట్టు లాగా టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితులు నెలకొన్నాయి. సొంత మైదానంలో శుక్రవారం రాత్రి కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్ లో 24 పరుగుల తేడాతో ముంబై జట్టు ఓడిపోయిందంటే.. ఆ జట్టు ఆటగాళ్ల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సీజన్లో ముంబై జట్టు ఏకంగా 11 మ్యాచ్లు ఆడింది. కేవలం మూడంటే మూడు మ్యాచ్ లలో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి ముంబై జట్టుకు సొంత గడ్డలో కోల్ కతా జట్టు పై అనితర సాధ్యమైన ఘనత ఉండేది. గత 12 సంవత్సరాలుగా ఆ రికార్డును అలాగే కొనసాగిస్తున్నది. కానీ శుక్రవారం నాటి మ్యాచ్ తో ఆ రికార్డును అయ్యర్ నేతృత్వంలోని కోల్ కతా జట్టు బద్దలు కొట్టింది. గొప్పగా మ్యాచ్ ప్రారంభించిన ముంబై.. ఆ తర్వాత పట్టు కోల్పోయి.. కోల్ కతా చేతిలో గర్వభంగం పొందింది. కిషన్, రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, వదేరా వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ముంబై జట్టు బ్యాటింగ్ ఏమాత్రం బలంగా లేదంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సూర్య కుమార్ లాంటి ఆటగాడు ఉన్నప్పటికీ.. అతడికి చేయూత అందించే మరో ప్లేయర్ ముంబై జట్టులో లేడు. అందువల్ల శుక్రవారం రాత్రి కోల్ కతా తో జరిగిన మ్యాచ్ ను గెలిచే స్థాయి నుంచి ఓటమి దాకా తెచ్చుకుంది.

కోల్ కతా తో ఓటమి తర్వాత ముంబై జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు దాదాపుగా ముగిసిపోయినట్టే. ఎందుకంటే ఇప్పటికే ఆ జట్టు 11 మ్యాచులు ఆడింది. మిగతా మ్యాచ్లలో భారీ తేడాతో విజయం సాధించాలి. ముంబై జట్టు ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ చూస్తే అది నెరవేరే అవకాశం కనిపించడం లేదు.. మిగతా జట్ల ఫలితాల గురించి ఆలోచించడం అంటే.. కుక్క తోకను పట్టుకుని గోదావరి ఈదినట్టే ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే ముంబై జట్టుకు ఈ సీజన్లో ప్రతీది అవరోధంగానే ఉంది. కెప్టెన్ ను మార్చినప్పటి నుంచి అది ఏదో ఒక రూపంలో జట్టు విజయాలకు ప్రతిబంధకంగా నిలుస్తూనే ఉంది. దీనిని గుర్తించడంలో మేనేజ్మెంట్ విఫలమైంది. ఫలితంగా ముంబై జట్టు ఈ సీజన్లోనూ దారుణమైన ఆటతీరుతో లీగ్ దశలోనే నిష్క్రమించే పరిస్థితిని కొని తెచ్చుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version