MS Dhoni New Record: 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా లెజెండరీ ఆటగాడు ధోని వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. 2024 సీజన్ నుంచి ఆటగాడిగానే చెన్నై జట్టులో ఉన్నాడు. సీజన్లో చెన్నై జట్టు సారధికి గాయం కావడంతో తాత్కాలిక నాయకుడిగా వ్యవహరించాడు. ఈ సీజన్లో చెన్నై జట్టు అంతగా ఆడలేక పోయినప్పటికీ.. ధోనికి ఉన్న ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా అతని రేంజ్ అంతకుమించి అనే స్థాయిలో పెరిగిపోయింది. ధోని నామస్మరణతో సోషల్ మీడియా ఊగిపోయింది.. అయితే ఇప్పుడు ధోని గురించి మరొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
విలువ విపరీతంగా పెరిగింది
అంతర్జాతీయ క్రికెట్ కు శాశ్వత వీడ్కోలు పలికినప్పటికీ టీమిండియా లెజెండరీ ఆటగాడు ధోని విలువ ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అత్యధిక బ్రాండ్లకు ప్రయోజక కర్తగా వ్యవహరించిన భారతీయ సెలబ్రిటీగా ధోని నిలిచాడు. ధోని దాదాపు 43 బ్రాండ్లకు ప్రయోజక కర్తగా ఉన్నాడు.. ఈ విషయాన్ని TAM AdEX వెల్లడించింది. ఈ జాబితాలో 35 బ్రాండ్లకు ప్రయోజక కర్తగా వ్యవహరిస్తూ షారుక్ ఖాన్ రెండవ స్థానంలో.. 28 బ్రాండ్లకు ప్రయోజక కర్తగా వ్యవహరిస్తూ అమితాబ్ బచ్చన్ మూడవ స్థానంలో.. 23 బ్రాండ్లకు ప్రయోజక కర్తగా వ్యవహరిస్తూ దీపికా పదుకొనే నాలుగో స్థానంలో ఉంది.. టీవీ వాణిజ్య ప్రకటనలో రోజూ ఎక్కువ కనిపించే సెలబ్రిటీలలో షారుక్ ఖాన్, ధోని తొలి రెండు స్థానాలలో ఉన్నారు.
అందువల్లే అంత విలువ
టీమ్ ఇండియాకు వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ లో చెన్నై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించి సరికొత్త రికార్డు సృష్టించాడు ధోని. ఆటతీరులో.. నాయకత్వంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు. అందువల్లే అతనంటే భారతీయులకు చాలా ఇష్టం. ఫలితంగా ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ.. అతడి విలువ ఏమాత్రం తగ్గలేదు. పైగా తన బ్రాండ్ వేల్యూ ను అంతకంతకూ పెంచుకున్నాడు. అందువల్లే అతనితో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. వివిధ బ్రాండ్లకు ప్రయోజక కర్తగా ఉంటూ ధోని దాదాపు కోట్లల్లో సంపాదించి ఉంటాడని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.