GST on IPL Tickets: కేంద్రం జీఎస్టీ విషయంలో అనేక సవరణలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 గా అభివర్ణిస్తోంది. ఇది మిగతా వర్గాలకు ఉపశమనం కలిగిస్తుండగా.. క్రికెట్ అభిమానులకు మాత్రం షాక్ ఇస్తోంది.. ఇప్పటివరకు జీఎస్టీ పన్ను విధానంలో 28% స్లాబ్ కొనసాగుతూ ఉండగా.. కేంద్రం తీసుకొచ్చిన సవరణల వల్ల ఐపిఎల్ టికెట్ పై ఇకపై 40 శాతం పన్ను పడనుంది. దీని ప్రకారం 1000 రూపాయలు ఉన్న టికెట్ ధర ఇప్పుడు ఒకవేళ 1280 రూపాయలు ఉంటాయి.. ఈనెల 22 తర్వాత అది 1400 రూపాయలకు చేరుకుంటుంది. భారత జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచులకు మాత్రం టికెట్ ధరపై 18 శాతం జీఎస్టీ అమల్లో ఉంటుంది. దీనిపై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
మనదేశంలో ఐపీఎల్ చూసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రారంభం నుంచి చివరి వరకు మైదానాలు ప్రేక్షకులతో కిటకిటలాడుతూ ఉంటాయి.. ఒకరకంగా ఐపీఎల్ మేనేజ్మెంట్లకు టికెట్ల విక్రయం ద్వారా కూడా విపరీతంగా డబ్బులు వస్తుంటాయి. ఇందులో మేనేజ్మెంట్లకు.. స్టేడియాల నిర్వాహకులకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు వెళుతుంటాయి. ఇందులో శాతాల ఆధారంగా వారి వారి ఖాతాలకు డబ్బు జమ అవుతూ ఉంటుంది..
జీఎస్టీ విధానంలో మార్పులు తీసుకొచ్చిన నేపథ్యంలో టికెట్ల ధర పెరగనుంది. ఇది ఒక రకంగా అభిమానులకు ఇబ్బందికరమైన వార్త. కేంద్రం తీసుకొచ్చిన విధానం తమ జేబులకు చిల్లు పెడుతుందని అభిమానులు వాపోతున్నారు. క్రికెట్ ను జనం విపరీతంగా ఆరాధిస్తున్నారు కాబట్టి.. కేంద్రం 40% స్లాబ్ విధానంలోకి దానిని చేర్చిందని తెలుస్తోంది. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా.. లగ్జరీ వస్తువులను 40% స్లాబ్ విధానంలోకి కేంద్రం మార్చింది. సిగరెట్లు, ఇతర ఖరీదైన వస్తువులు 40% స్లాబ్ విధానంలోకి మారిపోతాయి. ఈనెల 22 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని తెలుస్తోంది.
జిఎస్టి సవరణల ద్వారా కేంద్రం అనేక మార్పులను ఆశిస్తున్నది. పేద వర్గాలకు లబ్ధి చేకూర్చడం ద్వారా ప్రజలు ఆర్థికంగా స్థిరంగా ఉంటారని కేంద్రం అంచనా వేస్తున్నది. అనేక వర్గాల నుంచి వచ్చిన సిఫారసులు.. ఆర్థిక మేధావులు సూచించిన విధంగా ఈ మార్పులు చేపట్టామని కేంద్రం చెబుతున్నది. అయితే ఈ విధానాలు స్థిరంగా కొనసాగుతాయని.. ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.