https://oktelugu.com/

Mohammed Hussamuddin : మొన్న నిఖత్‌.. నేడు హుసామ్‌.. ప్రపంచ బాక్సింగ్ లో తెలుగోళ్ల సత్తా!

ఇటీవల నిజామాబాద్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ 52 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన మరో బాక్సర్‌ మహ్మద్‌ హుసాముద్దీన్‌ ప్రపంచ ఛాంపియన్‌లో సత్తా చాటుతున్నాడు

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 11, 2023 / 01:57 PM IST
    Follow us on

    Mohammed Hussamuddin : ప్రతిష్టాత్మక బాక్సింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ హవా కొనసాగుతోంది. యువ బాక్సర్‌ మహమ్మద్‌ హుసాముద్దీన్‌ పతకం సాధించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ ఈ నిజామాబాద్‌ చిచ్చరపిడుగు మెగా టోర్నీలో సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. పతకం ఖాయం చేసుకున్నాడు. చైనా బాక్సర్‌ పింగ్‌పై పంచ్‌లతో విరుచుకుపడ్డ హుసాముద్దీన్‌.. ప్రి క్వార్టర్స్‌లోనూ అదే దూకుడు ప్రదర్శించాడు.
    ప్రీ క్వార్టర్స్‌లో రష్యా బ్యాక్సర్‌ చిత్తు.. 
    57 కేజీల విభాగం ప్రీ క్వార్టర్స్‌లో రష్యా బాక్సర్‌ ఎడ్వర్డ్‌ సావిన్‌ తో హుసాముద్దీన్‌ తలపడ్డాడు. ఈ పోరులో 5–0 తేడాతో రష్యా బాక్సర్‌ ఎడ్వర్డ్‌ సావిన్‌ను చిత్తుగా ఓడించాడు. ఆట ప్రారంభం నుంచే హుసాముద్దీన్‌ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చూపిస్తూ..పవర్‌ ఫుల్‌ పంచ్‌లతో రెచ్చిపోయాడు. హుసాముద్దీన్‌ ధాటికి సావిన్‌ ఏమాత్రం నిలవలేకపోయాడు.
    క్వార్టర్స్‌లో అంజర్‌ బైజాన్‌ బాక్సర్‌పై.. 
    హుసాముద్దీన్‌ క్వార్టర్స్‌లో అజర్‌ బైజాన్‌కు చెందిన బాక్సర్‌ ఉమిద్‌ రుస్తమోవ్‌తో తలపడ్డాడు. బుధవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ పోరులో తెలుగోడి పంచ్‌ పవర్‌కు ప్రత్యర్థి పూర్తిగా తలవంచాడు. దీంతో హుసాముద్దీన్‌ నేరుగా సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. చిరస్మరణీయ విజయాన్ని ఖాతాలో వేసుకుని పతకాన్ని ఖరారు చేసుకున్నాడు.
    మొన్న నిఖత్‌.. నేడు హుసామ్‌..
    ఇటీవల నిజామాబాద్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ 52 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన మరో బాక్సర్‌ మహ్మద్‌ హుసాముద్దీన్‌ ప్రపంచ ఛాంపియన్‌లో సత్తా చాటుతున్నాడు.
    తండ్రి, సోదరులూ బాక్సర్లే.. 
    మహ్మద్‌ హుస్సాముద్దీన్‌ 1994, ఫిబ్రవరి 12న నిజామాబాదు పట్టణంలో జన్మించాడు. తండ్రి బాక్సర్‌ సంసముద్దీన్‌. సోదరులైన అహ్తేషాముద్దీన్, ఐతేసాముద్దీన్‌ కూడా అంతర్జాతీయ బాక్సింగ్‌ ఈవెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
    సాధించిన పతకాలు.. 
    – ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో హుసాముద్దీన్‌ కాంస్యం కూడా గెలుచుకున్నాడు.
    – 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో 57 కిలోల ఫెదర్‌వెయిట్‌ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.
    – 57 కేజీల విభాగం ట్రయల్స్‌లో 2019 ఆసియా చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత కవీందర్‌సింగ్‌పై విజయం సాధించి 2022 జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్‌ క్రీడలకు ఎంపికయ్యాడు.
    తెలంగాణ ప్రభుత్వ సత్కారం..
    స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో 2022, ఆగస్టు 22న జరిగిన ముగింపు వేడుకలలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మహ్మద్‌ హుస్సాముద్దీన్‌ను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించాడు.