Messi Kolkata Tour: మనదేశం క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతూ ఉంటుంది. అయితే పశ్చిమ బెంగాల్ మాత్రం ఇందుకు భిన్నం. పశ్చిమ బెంగాల్లో కోల్ కతా నగరం మరింత భిన్నం.. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామంది ఫుట్ బాల్ ఆడుతుంటారు. ఇక్కడ ఫుట్ బాల్ క్లబ్ లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మెస్సికి వీరాభిమానులు ఉన్నారు. అటువంటి మెస్సి తమ ప్రాంతానికి వస్తున్నారని తెలియడంతో వీరంతా సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు భారీగా ధరలు పెట్టి టికెట్లు కొనుగోలు చేశారు. సాల్ట్ లేక్ స్టేడియానికి తండోపతండాలుగా వచ్చారు.
అంత భారీగా అభిమానులు వచ్చినప్పటికీ సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సి కేవలం 22 నిమిషాలు మాత్రమే ఉన్నాడు. ఆ సమయంలో అతడు చుట్టూ సెలబ్రిటీలు, భద్రత సిబ్బంది ఉండడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. దాదాపు 50 వేల మంది అభిమానులు మెస్సిని చూసేందుకు వచ్చారు. భారీ ధరకు టికెట్లు కొనుగోలు చేశారు. అయినప్పటికీ మెస్సీ ని చూసే అవకాశం వారికి లభించలేదు. దీంతో అభిమానులలో ఆగ్రహం పెరిగిపోయింది. నిర్వాహకులపై కట్టలు తెంచుకున్న కోపంతో అభిమానులు ఊగిపోయారు. దీంతో ఈవెంట్ ప్రమోటర్ శతద్రు దత్తా(Shatadru Dutta) ను వెస్ట్ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
శతద్రు దత్తా కోల్ కతా లో మెస్సి ఈవెంట్ ప్రధాన నిర్వాహకుడు. వాస్తవానికి కోల్ కతా కు మెస్సి రావడానికి ఇతడు ఎంతో కష్టపడ్డాడు.. అతడి తాపత్రానికి మెచ్చి మెస్సి కోల్ కతా వచ్చాడు. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో పిలే, డియాగో మారడోనా వంటి వారిని కూడా అతడు భారతదేశానికి తీసుకొచ్చాడు. అంతేకాదు పోర్చుగీసు ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో ను కూడా ఇండియాకి తీసుకొస్తారని ఇటీవల దత్త విలేకరుల ముందు మాట్లాడాడు.
మెస్సి సాల్ట్ లేక్ స్టేడియంలోకి రాగానే రాజకీయ నాయకులు, వీఐపీలు, పోలీస్ అధికారులు చుట్టూ చేరారు. దీంతో మెస్సి ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యాడు . మైదానంలో అతడు తిరిగే క్రమంలో తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యాడు. ఇదే సమయంలో మాజీ ప్లేయర్లకు ఆటోగ్రాఫ్ లు ఇచ్చాడు. అయితే పరిస్థితి అయోమయంగా మారుతున్న నేపథ్యంలో శతద్రు అప్రమత్తమయ్యాడు. ” మీరు గందరగోళానికి గురిచేస్తున్నారు. అయోమయానికి కారణం అవుతున్నారు. దయచేసి అతడిని కాస్త స్థిమితం గా ఉంచండి. మైదానాన్ని వదిలేయండి” అంటూ మైక్ లో పదేపదే చెప్పాడు. అయినప్పటికీ ఉపయోగ లేకుండా పోయింది. అక్కడ ఉన్న సెలబ్రిటీలు కూడా శతద్రు మాటలను లెక్క చేయలేదు. దీంతో భద్రత సిబ్బంది కేవలం 22 నిమిషాల్లోనే మెస్సిని వెనక్కి తీసుకెళ్లారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం గంట సేపు మెస్సి మైదానంలో ఉండాలి. కానీ అక్కడ పరిస్థితి దారుణంగా ఉండడంతో 22 నిమిషాల్లోనే అతడు వెళ్లిపోయాడు . దీంతో నిర్వాహకులపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసి మైదానంలో రచ్చ చేశారు. నేపథ్యంలో బెస్ట్ బెంగాల్ పోలీసులు సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన గొడవకు దత్తా కారణమని భావించి అతడిని కోల్ కతా విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రేక్షకులకు టికెట్లు డబ్బులు తిరిగి ఇస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.