Messi Hyderabad Tour: తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానించేందుకు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు డిసెంబర్ 8, 9వ తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. ఈ సమ్మిట్‌కు దేశంలోని వ్యాపారులతోపాటు వివిధ దేశాల ప్రతినిధులు, వ్యాపారులు హాజరయ్యారు. కానీ కాంగ్రెస్
అధికారంలో ఉన్న రాష్ట్రంలో జరుగుతున్న సమ్మిట్‌కు ఆ పార్టీ అగ్రనేత రాహాల్‌గాంధీ మాత్రం రాలేదు. కానీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు వచ్చిన అర్జంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ జెస్సిని చూసేందుకు మాత్రం ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయ్యారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రత్యేకంగా ఆహ్వానించినా..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాహుల్ గాంధీకి ప్రత్యేక ఆహ్వానాలు పంపినప్పటికీ, డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు ఆయన ఒక్క రోజు కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవకాశాన్ని వదులుకున్నారు.
మెస్సీ కలవడానికి ప్రత్యేక ఫ్లైట్..
అదే సమయంలో లియోనెల్ మెస్సీని కలవడానికి రాహుల్ ప్రత్యేక ఫ్లైట్‌తో హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్ర పాలనా విజయాలకు ముందు వ్యక్తిగత ఆసక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయ వర్గాల్లో, సామాన్య ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ చర్య పార్టీ ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఎస్‌ఐఆర్‌పైనా నిర్లక్ష్యమే..
ఆరు నెలలుగా ఎస్‌ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) విషయంపై పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చ ప్రారంభమైన గంట వరకు లోక్‌సభలో రాహుల్ లేకపోవడం గమనార్హం. తర్వాత వచ్చి కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం ప్రతిపక్ష బాధ్యతలకు సరిపోతుందా అనేది ప్రశ్న. ఇది ఆయన రాజకీయ జాగ్రత్తలపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
మొత్తంగా రాహుల్ గాంధీ చర్యల్లో దృఢసంకల్పం, స్థిరత్వం కనిపించకపోవడం కాంగ్రెస్ భవిష్యత్తుకు సవాల్‌గా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు, జాతీయ అంశాలపై పట్టుదల చూపకపోతే పార్టీ ఆకర్షణ క్షీణిస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ట్రెండ్ కొనసాగితే 2029 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరింత కష్టమని పేర్కొంటున్నారు.