Homeక్రీడలుMatheesha Pathirana: ధోని నా తండ్రి లాంటివాడు.. క్రికెటర్ కామెంట్స్ వైరల్

Matheesha Pathirana: ధోని నా తండ్రి లాంటివాడు.. క్రికెటర్ కామెంట్స్ వైరల్

Matheesha Pathirana: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు తో ఇండియన్ క్రికెట్ టీం కు అవినాభావ సంబంధం ఉంది. 2007లో ఆవిర్భవించిన టి20 వరల్డ్ కప్ ను, 2011లో వన్డే వరల్డ్ కప్ ను, చాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కు అందించిన ఘనత ధోని సొంతం. బ్యాటింగ్, కీపింగ్ లో ధోనికి సాటైన క్రికెటర్ లేడంటే అతిశయోక్తి కాదు. వ్యూహాలను రచించడంలో.. వాటిని అమలు చేయడంలో ధోని తర్వాతే ఎవరైనా. అందువల్లే అతడు టీమిండియా కు అత్యంత విజయవంతమైన కెప్టెన్ అయ్యాడు. తన నాయకత్వంలో టీమిండియా అనితర సాధ్యమైన విజయాలు సాధించేలా కృషి చేశాడు. అందుకే ధోని అంటే చాలామంది పడి చస్తారు. విపరీతంగా అభిమానిస్తారు. టీమిండియాను మాత్రమే కాదు.. ఐపీఎల్ లో చెన్నై జట్టును అత్యంత విజయవంతమైన టీం గా రూపొందించాడు ధోని. ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా ఆవిర్భవించేలా చేశాడు. ధోని నాయకత్వంలో ఆడిన ఆటగాళ్లు చాలామంది మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో మన దేశం వాళ్లు ఉన్నారు, ఇతర దేశాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ముఖ్యమైనవాడు శ్రీలంకకు చెందిన మతీశ పతీరణ. ప్రస్తుతం చెన్నై జట్టు తరఫున మతీశ పతీరణ ఆడుతున్నాడు. అద్భుతంగా బౌల్ చేస్తూ.. జట్టు విజయాలలో కీలకంగా మారాడు.

ఇటీవల మహేంద్రసింగ్ ధోనిని మతీశ పతీరణ తన కుటుంబంతో కలిశాడు. ఇలా కలవడం మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఇలా జరిగింది. వాస్తవానికి చెన్నై జట్టులోకి వచ్చిన తర్వాత మతీశ పతీరణ జాతకం మారిపోయింది. ఐపీఎల్లో ప్రతిభ చూపడంతో.. శ్రీలంక జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఐపీఎల్ లో చెన్నై జట్టు తరుపున ఆడుతున్న నేపథ్యంలో.. ధోని ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుంటాడు. వాటిని మతీశ పతీరణ అమలులో పెట్టడం మొదలుపెట్టాడు. ఫలితంగా అద్భుతమైన బౌలర్ గా రాటు దేలాడు. మలింగ లాగా బాల్స్ వేస్తూ, ప్రత్యర్థి బ్యాటర్ లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. జట్టుకు అవసరమైన సమయాల్లో వికెట్లు తీస్తూ ఆపద్బాంధవుడి అవతారం ఎత్తుతున్నాడు. ప్రస్తుతం అతడు చెన్నై జట్టులో అత్యంత కీలకమైన బౌలర్ గా మారాడు. ఈ నేపథ్యంలో తన ప్రయాణం గురించి యూట్యూబ్ చిట్ చాట్ లో వెల్లడించాడు. ” నా క్రికెట్ జీవితంలో మా నాన్న తర్వాత స్థానం మహేంద్రసింగ్ ధోనిదే. ఆయన నాకు తండ్రి లాంటివాడు. ఆయన నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. నాకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తాడు. మైదానంలో ఉన్నప్పుడు, ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆయన నాకు సలహాలు ఇవ్వడు. కానీ, నాకు అవసరం అనిపించినప్పుడు నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్తాను. అప్పుడు నాకు ఆయన సలహాలు ఇస్తాడు. ఆటగాళ్లను ఎప్పుడు, ఎలా కాపాడుకోవాలో ధోనికి తెలుసని” మతీశ పతీరణ పేర్కొన్నాడు.

ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మతీశ పతీరణ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. గత సీజన్లో 12 మ్యాచ్లు ఆడి, 19 వికెట్లు పడగొట్టాడు. చెన్నై జట్టు గత సీజన్లో టైటిల్ గెలవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.. ఇక ప్రస్తుత సీజన్లో ఆరు మ్యాచ్ లు ఆడి, 13 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ విభాగంతో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల వీసా సంబంధ సమస్యలు ఎదురు కావడంతో మతీశ పతీరణ కొన్ని మ్యాచ్లు ఆడలేకపోయాడు. ప్రస్తుతం ఆ సమస్య పరిష్కార కావడంతో.. త్వరలో చెన్నై జట్టు లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version