Tirumala: ఆపద మొక్కుల వాడు.. కలియుగ దైవం.. ఇలా రకరకాల పేర్లతో భక్తులకు అండగా ఉంటున్నాడు ఆ తిరుమల శ్రీనివాసుడు. తెలుగువారు ఎక్కడున్నా ఆ గోవిందుడిని దర్శనాన్ని ఏడాదికి ఒక్కసారైనా చేసుకోవాలని తపన పడుతూ ఉంటారు. అందుకే తిరుమలలో నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలకు వెళ్లిన వారి మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఆ మాడ వీధుల్లో తిరిగినప్పుడు సాక్షాత్తూ స్వర్గంలో విహరించిన ఆనందం కలుగుతుంది. అయితే తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క పురుషుడు తప్పనిసరిగా తలనీలాలు సమర్పించి గుండు కొట్టించుకుంటారు. ఇలా తప్పనిసరిగా ఎందుకు తలనీలాలు సమర్పిస్తారు?
ఇది కలియుగం. ప్రతి మనిషి తనకు తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తాడు. ఈ తప్పులకు ప్రాయచ్చిత్తం కలగాలంటే మరో జన్మ ఎత్తాలని కొందరు అంటారు. కానీ దేవదేవుడిని దర్శన భాగ్యం కలిగి, తలనీలాలు సమర్పిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని మరికొందరు చెబుతూ ఉంటారు. మనిషి చేసిన పాపాలన్నీ జుట్టులోనే ఉంటాయట. ఈ పాపాలను తొలగించుకోవాలంటే దైవ సన్నిధిలో తలనీలాలు సమర్పించాలని అంటారు.
హిందూ శాస్త్రం ప్రకారం ప్రతీ వ్యక్తి పుట్టిన నుంచి చనిపోయే వరకు పలు సార్లు తలనీలాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. జన్మించిన శిశువు పుట్టువెంట్రులకు ముందుగా ఇలవేల్పుకు సమర్పిస్తారు. ఆ తరువాత మొక్కుబడుల దేవళ్లకు ఇస్తారు. ఇలా పలు సార్లు తలనీలాలు సమర్పించడం వల్ల అప్పటి వరకు చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అయితే తిరుమలకు వచ్చిన ప్రతీ పురుషుడు తప్పనిసరిగా తలనీలాలు సమర్పిస్తాడు. దానికి కారణం ఏంటంటే?
సాధారణంగా తిరుమలేశుడి భక్తి లో మునిగిన స్త్రీ, పురుషులందరూ తిరుమలకు వస్తు తలనీలాలు సమర్పిస్తారు. ఒక మనిషి చేసిన పాపాలతో పాటు జుట్టు ఉండడం వల్ల గర్వం, అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఇవి తొలగిపోవడానికి ముందే మొక్కుకున్న ప్రకారం తలనీలాలు సమర్పిస్తారు. అయితే మహిళల శిరోజాలు పెరగడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల కొందరు మాత్రమే తమ శిరోజాలను దేవుళ్లకు సమర్పిస్తారు. మిగతా వారు ముందుకు రారు. పురుషులకు శిరోజాలు తొందరగా వస్తాయి. దీంతో వారికి ఇబ్బంది లేదు. ఇలా చాలా మంది తిరుమలేశుడికి ఓ వైపు మొక్కులు చెల్లిస్తూ తలనీలాలు సమర్పిస్తారు.