Hyderabad Cricket Association: హైదరాబాద్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. దమ్ బిర్యాని, ఇరానీ చాయ్, చార్మినార్, సైబర్ టవర్స్, హుస్సేన్ సాగర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఆ అద్భుతాలలో చోటు సంపాదించుకుంది ఉప్పల్ క్రికెట్ స్టేడియం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక క్రికెట్ స్టేడియం ఇదే. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితం కావడంతో.. ఇక్కడ టీమిండియా ఆడే మ్యాచ్ లు జరుగుతాయి. హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో ఈ మైదానాన్ని ఓన్ గ్రౌండ్ గా ఎంచుకుంది. అందువల్లే ఆ జట్టు ఆడే మ్యాచ్ లలో సింహ భాగం ఇక్కడే జరుగుతాయి.
Also Read: విలేకరి చెప్పాడు.. పోలీసులు దోచుకున్నారు.. క్యా క్రైం హై
హైదరాబాద్ క్రికెట్ మైదానానికి ఎంతోమంది క్రీడాకారులను అందించిన ఘనత ఉంది.. హైదరాబాద్ క్రికెట్ మైదానం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుతం పీకల్లోతు వివాదాలలో కూరుకుపోయింది. ముఖ్యంగా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని.. అధికారాన్ని దుర్వినియోగం చేశాడని.. సంతకాలను ఫోర్జరీ చేశాడని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పై విజిలెన్స్ పోలీస్ అధికారులు అభియోగాలు మోపారు. అంతేకాదు పూర్తి ఆధారాలతో నివేదిక సమర్పించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో వివాదాలు వెలుగుచూసిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నదని సమాచారం. అసోసియేషన్లో నెలకొన్న సమస్యలను సాకుగా చూపి భవిష్యత్ కాలంలో ఈ మైదానంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడానికి వెనుకా ముందు ఆలోచిస్తుందని సమాచారం. ఇటీవల ఐపిఎల్ జరిగినప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ వేధించారు. అప్పుడే ఈ వ్యవహారంపై బీసీసీఐ పెద్దలు దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడినట్టు సమాచారం.. నిధులలో గోల్ మాల్, నకిలీ పత్రాలతో అధ్యక్షుడిగా మారడం.. సంతకాలు ఫోర్జరీలు చేయడం.. ఇష్టానుసారంగా వ్యవహారాలు సాగించడం వంటివి భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దల దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. వారు కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
వివాదాస్పదమైన నిర్ణయాల వల్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీర్తి మసకబారింది. గొప్ప గొప్ప క్రికెటర్ల ను అందించిన అసోసియేషన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల ఐపీఎల్ లో హైదరాబాద్ మేనేజ్మెంట్ ను టికెట్ల కోసం ఇబ్బంది పెట్టడం.. నిధులలో ఇష్టానుసారంగా వ్యవహరించడం.. నకిలీ పత్రాలు రూపొందించడం వంటివి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భవిష్యత్తు మొత్తాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు అంతర్జాతీయంగా మ్యాచులు, ఐపీఎల్ మ్యాచ్లు వీక్షించడానికి ఉప్పల్ స్టేడియం దిక్కు.. ఇన్ని వివాదాలు ఉన్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి భవిష్యత్తు కాలంలో ఈ మైదానంలో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది..
ఈ వ్యవహారాన్ని త్వరగా తేల్చి.. అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులను బయటికి పంపించి.. నూతన కార్యవర్గాన్ని కనుక తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు మళ్లీ మంచి రోజులు వస్తాయి. అప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై నమ్మకం ఏర్పడుతుంది. తద్వారా మ్యాచ్ లు నిర్వహించడానికి మార్గం ఏర్పడుతుంది. ఇవన్నీ జరిగిన పక్షంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరువు మూసీ నదిలో కలిసిపోతుంది.