MS Dhoni : మరో అరుదైన మైలురాయికి అడుగు దూరంలో మహేంద్రసింగ్ ధోని..!

ఈ నేపథ్యంలో ఫైనల్ పోరు ఎంతో ఆసక్తికరంగా సాగనుంది. ఫైనల్ మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్, చెన్నై జట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి.

Written By: K.R, Updated On : May 28, 2023 8:44 am
Follow us on

MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ధోని సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ ఆడటం ద్వారా ఐపీఎల్ లో 250 మ్యాచులు పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్ గా ఘనత సాధించనున్నాడు. మరే క్రికెటర్ కు సాధ్యం కానీ అనేక రికార్డులను ధోని ఐపిఎల్ లో నమోదు చేశాడు. ధోని నమోదు చేసుకున్న పలు రికార్డుల గురించి తెలుసుకుందాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో మహేంద్రసింగ్ ధోని ఒకడు. వ్యక్తిగతంగా అద్భుతమైన ప్రదర్శనతోపాటు జట్టు కెప్టెన్ గా కూడా గొప్ప విజయాలను నమోదు చేశాడు మహేంద్రుడు. ఈ క్రమంలోనే మరో అరుదైన ఘనతను ధోని సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్ గా ధోని ఘనత సాధించబోతున్నాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ ఆడడం ద్వారా 250 ఐపీఎల్ మ్యాచ్ లు పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు మహేంద్రసింగ్ ధోని.
ఒకే ఒక్క మ్యాచ్ దూరంలో మహేంద్ర సింగ్ ధోని.. 
మహేంద్రసింగ్ ధోని ఇప్పటి వరకు ఐపీఎల్ లో 249 మ్యాచులు ఆడాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడిన 16 సీజన్లలో ఈ మ్యాచ్ లు ఆడాడు ధోని. మొత్తంగా 34.09 యావరేజ్ తో 5082 రన్స్ చేశాడు మహేంద్రసింగ్ ధోని. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ తో ధోని 250 మ్యాచ్ లను పూర్తి చేసుకోబోతున్నాడు. దీంతో ఐపీఎల్ లో 250 మ్యాచులు ఆడిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించనున్నాడు ధోని. ఇకపోతే అత్యధిక మ్యాచ్ లు ఆడిన అతగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ధోనీ తర్వాత రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 243 మ్యాచ్ లు ఆడాడు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ 242 మ్యాచులతో మూడో స్థానంలో కొనసాగుతుండగా, కోహ్లీ 237 మ్యాచ్ లతో నాలుగో స్థానంలో, జడేజా 225 మ్యాచ్ లతో ఐదో స్థానంలో, శిఖర్ ధావన్ 217 మ్యాచ్ లతో ఆరో స్థానంలో, సురేష్ రైనా 217 మ్యాచ్ లతో ఏడో స్థానంలో, ఉతప్ప 205 మ్యాచ్ లతో ఎనిమిదో స్థానంలో, అంబటి రాయుడు 203 మ్యాచ్ లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు.
పరుగులు వరద పారించిన ధోని.. 
మహేంద్ర సింగ్ ధోని ఇప్పటి వరకు ఆడిన 249 మ్యాచుల్లో 5082 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 84 కావడం విశేషం. 39.09 సగటుతో ఈ పరుగులు చేశాడు ధోని. ఇప్పటి వరకు 24 అర్ధ సెంచరీలు సాధించిన ధోని, 349 ఫోర్లు, 239 సిక్సులు కొట్టాడు. 135.96 స్ట్రైక్ రేటుతో ఈ పరుగులను ధోనీ సాధించాడు. ఇప్పటి వరకు 141 క్యాచ్ లు అందుకున్న మహేంద్రసింగ్ ధోని, 41 మందిని స్టంపౌట్ ద్వారా ఔట్ చేశాడు.
ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధోని అభిమానులు..
సాధారణంగానే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అంటే స్టేడియాలు అభిమానులతో నిండిపోతుంటాయి. అందులోనూ ఆదివారం జరగనున్నది ఫైనల్ మ్యాచ్, అందులోనూ ధోనికి జీవితాంతం గుర్తుండిపోయే 250 మ్యాచ్. దీంతో స్టేడియానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులు భారీగా పోటెత్తే అవకాశం కనిపిస్తోంది. స్టేడియం మొత్తం చెన్నై జట్టు అభిమానులతో నిండిపోయే పరిస్థితి ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ పోరు ఎంతో ఆసక్తికరంగా సాగనుంది. ఫైనల్ మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్, చెన్నై జట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి.