https://oktelugu.com/

KL Rahul : రాహుల్ తో లక్నో ఓనర్ కాళ్ల బేరం…

ట్విట్టర్లో రాహుల్, సంజీవ్ కలిసి ఉన్న దృశ్యం ఎప్పటిదోనని.. హైదరాబాద్ జట్టుతో ఓటమి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే దాకా తీసుకొచ్చిందనే తెలుస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 14, 2024 / 08:09 PM IST

    Lucknow Supergiants owner Sanjeev Goenka

    Follow us on

    ఆట అన్నాకా గెలుపుంటుంది. ఓటమి కూడా ఉంటుంది. గెలిస్తే ఉత్సాహం ఉరకలేస్తుంది. అది మరో విజయానికి దారులు పరుస్తుంది. ఒకవేళ ఓడిపోతే.. ఆ ఓటమి గుణపాఠం నేర్పుతుంది. విజయం సాధించే కసిని పెంచుతుంది. మైదానంలో ఆడే ఆటగాళ్లకు ఓటమి బాధ ఏంటో.. గెలవాల్సిన అవసరం ఏంటో తెలుస్తుంది. అంతేగాని ఆటగాళ్ల మీద పెట్టుబడి పెట్టిన కార్పొరేట్ వ్యాపారులకు అస్సలు తెలియదు. ఇటీవల ఐపీఎల్ లో భాగంగా లక్నో జట్టు హైదరాబాద్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో లక్నో జట్టు కెప్టెన్ రాహుల్ ను ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా బహిరంగంగానే అవమానించాడు. హైదరాబాద్ జట్టు చేతిలో ఓటమి అనంతరం మైదానంలోనే రాహుల్ పై విమర్శలు చేశాడు. రాహుల్ తో ఆవేశంగా మాట్లాడాడు. ఇంత జరుగుతున్నప్పటికీ రాహుల్ మౌనంగా అలా ఉండిపోయాడు. సర్ది చెప్పే అవకాశం కూడా సంజీవ్ రాహుల్ కు ఇవ్వలేదు. అయితే ఈ సంఘటన అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

    మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన కెప్టెన్ పై టీమ్ ఓనర్ అలా స్పందించాల్సిన అవసరం ఏంటని మాజీ క్రీడాకారులు అభిప్రాయపడ్డారు. లక్నో జట్టు యజమానిపై తీవ్ర విమర్శలు చేశారు. మహమ్మద్ షమీ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వాళ్లు రాహుల్ కు అండగా నిలిచారు. సంజీవ్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టారు. కెప్టెన్ కు గౌరవం ఇవ్వడం కూడా తెలియదా అంటూ విమర్శలు చేశారు. జట్టు గురించి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే డ్రెస్సింగ్ రూమ్ లేదా.. ఇతర ప్రాంతాలను ఎంచుకోవాలని చురకలంటించారు.

    సంజీవ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో లక్నో జట్టు కెప్టెన్ రాహుల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. వాస్తవానికి రాహుల్ ఆధ్వర్యంలో లక్నో జట్టు గత రెండు సీజన్లలో ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. ఆ విషయాన్ని మర్చిపోయి సంజీవ్ వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాహుల్ తీవ్రంగా బాధపడ్డాడని.. లక్నో జట్టు కు గుడ్ బాయ్ చెబుతాడని ప్రచారం జరిగింది. అంతేకాదు తన సొంత రాష్ట్రంలోని జట్టైన బెంగళూరు తరఫున అతడు ఆడతాడని ప్రధాన మీడియాలో కథనాలు వెలుపడ్డాయి. అతని రాక కోసం బెంగళూరు ఫ్రాంచైజీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోందనే చర్చ సాగింది. ఈ క్రమంలోనే లక్నో యజమాని సంజీవ్ చేసిన తప్పు తెలుసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాహుల్ లక్నో జట్టును వీడిపోకుండా కాళ్ల బేరానికి వచ్చాడని సమాచారం.

    సోమవారం రాత్రి తన ఇంటికి రాహుల్ ను సంజీవ్ ప్రత్యేకంగా ఆహ్వానించాడట. అతనితో కలిసి భోజనం కూడా చేశాడట. దాదాపు తాను చేసిన పనికి క్షమాపణ చెప్పే ప్రయత్నం చేశాడట. మరి సంజీవ్ ప్రాయశ్చిత్తం రాహుల్ మనసు కరిగిస్తుందా? తిరిగి లక్నో వైపు చూసేలా చేస్తుందా? లేక వచ్చే ఏడాది మెగా వేలంలో అతడు పాల్గొంటాడా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అయితే సంజీవ్ ఇంటికి రాహుల్ వెళ్లలేదని, అది మొత్తం మీడియా సృష్టి అనే వాదన కూడా వినిపిస్తోంది. ట్విట్టర్లో రాహుల్, సంజీవ్ కలిసి ఉన్న దృశ్యం ఎప్పటిదోనని.. హైదరాబాద్ జట్టుతో ఓటమి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే దాకా తీసుకొచ్చిందనే తెలుస్తోంది.