Congress Aand MIM: మజ్లిస్‌తో ములాఖత్‌.. హైదరాబాద్‌ బరిలో కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థి!

హైదరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓ బీసీ అభ్యర్థిని పెట్టాలని భావిస్తోంది. తద్వారా ఎంఐఎంతో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : April 13, 2024 8:48 am

Congress Aand MIM

Follow us on

Congress Aand MIM: తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎంఐఎం పార్టీతో అంతర్గత ఒప్పందానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లో ఎంఐఎంను ఓడించాలని మొదట పట్టుబట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఇందుకోసం సానియామీర్జ, ఫిరోజ్‌ఖాన్‌తోపాటు మరికొందరి పేర్లను కూడా పరిశీలించింది. కానీ, చివరకు ఓ హిందూ అభ్యర్థిని నిలబెట్టి మజ్లిస్‌కు మేలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ అధికారంలో లేనంత వరకు ఆ పార్టీని కించపరిచేలా మాట్లాడిన ఎంఐఎం, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమిలో కీలక పాత్ర పోషించింది. కానీ, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఇప్పుడు దోస్తీకి సిద్ధమైంది.

అసద్‌ గెలిచేలా..
ఇక హైదరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓ బీసీ అభ్యర్థిని పెట్టాలని భావిస్తోంది. తద్వారా ఎంఐఎంతో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. ఎంఐఎం నేతలు కూడా అదే వైఖరి అవలంబిస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు క్రమంగా దూరమవుతున్నారు. బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతతో తనకు ఈసారి గట్టి పోటీ ఎదురవుతుందని భావించిన ఎంఐఎం చీఫ్‌ అసద్‌.. కాంగ్రెస్‌ కూడా ముస్లిం అభ్యర్థిని నిలిపితే ముస్లిం ఓట్లు చీలి బీజేపీకి లబ్ధి కలుగుతుందని భావించారు. దీంతో కాంగ్రెస్‌ తరపున బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించాలని ఒవైసీ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

హైదరాబాద్‌లో సహకరిస్తే..
హైదరాబాద్‌తో తన గెలుపునకు కాంగ్రెస్‌ సహకరిస్తే, రాష్ట్రంలోని 16 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలుపునకు తాము సహకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, ఎంఐఎం చీఫ్‌ ఒవైసీ మధ్య అంగీకారం, అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీసీ క్యాండిడేట్‌ను పోటీకి దించేందుకు రెడీ అవుతోంది అధికార కాంగ్రెస్‌ పార్టీ.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్‌ఎస్‌తో అంటకాగిన ఎంఐఎం.. ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేసింది. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పంచన చేరింది. ఎవరు అధికారంలో ఉంటే వారితో దోస్తీ మజ్లిస్‌ పార్టీకి అలవాటే.