LSG Vs CSK IPL 2024: లక్నోను గెలిపించడమే కాదు.. ధోని రికార్డునూ రాహుల్ బ్రేక్ చేశాడు.. ఇకపై అతడే నెంబర్ వన్..

లక్నో జట్టు తరఫున కెప్టెన్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 82 పరుగులు చేసి సత్తా చాటాడు. అతడి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ వల్ల లక్నో జట్టు విజయాన్ని దక్కించుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 20, 2024 10:19 am

LSG Vs CSK IPL 2024

Follow us on

LSG Vs CSK IPL 2024: కోల్ కతా, ఢిల్లీ చేతిలో వరుస ఓటముల తర్వాత.. లక్నో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. సొంత మైదానంలో చెన్నై జట్టుపై విజయాన్ని దక్కించుకుంది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి ఏకబాకింది. నెట్ రన్ రేట్ మెరుగుపరచుకొని, ప్లే ఆఫ్ అవకాశాన్ని సుస్థిరం చేసుకుంది.

లక్నో జట్టు తరఫున కెప్టెన్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 82 పరుగులు చేసి సత్తా చాటాడు. అతడి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ వల్ల లక్నో జట్టు విజయాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాహుల్.. మైదానం పరిస్థితి తెలుసు కాబట్టి, రెండవ మాటకు తావు లేకుండా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫలితంగా చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 176 రన్స్ చేసింది. రవీంద్ర జడేజా 57*, మహేంద్ర సింగ్ ధోని 28* రాణించడంతో చెన్నై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించడానికి అవకాశం లేకుండా పోయింది.

చెన్నై విధించిన 177 రన్స్ విజయ లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రాహుల్ తో పాటు క్వింటన్ డికాక్ 54 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 15 ఓవర్లలో 134 రన్స్ భాగస్వామ్యం నిర్మించారు. లక్నో జట్టు తరఫున ఏ వికెట్ కైనా ఇది రెండవ అత్యుత్తమ భాగస్వామ్యం. ఇదే జోడి 2022లో కోల్ కతా పై 210 పరుగుల భాగస్వామ్యం టాప్ రికార్డ్ లలో ఒకటిగా ఉంది.

ఇక చెన్నై జట్టుపై శుక్రవారం రాత్రి డికాక్, రాహుల్ నెలకొల్పిన భాగస్వామ్యం మూడవ అత్యుత్తమమైనది.. రహనే, వాట్సన్ (రాజస్థాన్ రాయల్స్, 144 రన్స్), శిఖర్ ధావన్ – పృథ్వీ షా(ఢిల్లీ క్యాపిటల్స్ 138 రన్స్) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక శుక్రవారం రాత్రి చెన్నై జట్టు జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించిన కెప్టెన్ కె.ఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 50 కంటే ఎక్కువ స్కోర్ అత్యధిక సార్లు చేసిన వికెట్ కీపర్ గా చరిత్ర ఎక్కాడు. ఇలా 50 కంటే ఎక్కువ పరుగుల స్కోరును ఐపిఎల్ లో రాహుల్ 25 సార్లు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు చెన్నై జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మీద ఉండేది. అతడు 24 సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు. ధోని తర్వాత డికాక్ 23, దినేష్ కార్తీక్ 21, రాబిన్ ఊతప్ప 18 హాఫ్ సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.