Lionel Messi: అంతర్జాతీయ క్రీడారంగంలో కొంతమంది క్రీడాకారులకు విపరీతమైన విలువ ఉంటుంది. వారు ఒక మాట చెబితే ప్రపంచం మొత్తం ఊగిపోతుంది. ఒక అడుగు వేస్తే ప్రపంచం మొత్తం షేక్ అవుతుంది. ఇక వివిధ బ్రాండ్లకు వారు ప్రచారం చేస్తే వాటి విలువ అమాంతం పెరిగిపోతుంది. ఇప్పుడు ఇటువంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కాకపోతే ఆ క్రీడాకారుడు ఆ ఉత్పత్తికి నేరుగా ప్రచారం చేయలేదు. కేవలం ఒక మాట చెప్పాడు.. ఒక్కసారిగా ఆ కంపెనీ పరిస్థితి మారిపోయింది.
శీతలపానియాల తయారీ కంపెనీలలో కోకా కోలా(Coca-Cola) కు ప్రపంచ మార్కెట్లో మంచి స్థానమే ఉంది. కొన్ని మార్కెట్లలో ఈ కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులు అధికంగా అమ్ముడుపోతుంటాయి. ఈ కంపెనీ తయారు చేసిన ఉత్పత్తిలో ఎక్కువ అమ్ముడుపోయే పానీయంగా స్ప్రైట్ (Sprite) పేరు గడించింది. ఈ ఉత్పత్తికి మనదేశంలో పేరు మోసిన సెలబ్రిటీలు ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఈ బాధ్యతను ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సి (Lionel Messi) భుజాలకు ఎత్తుకున్నాడు. కాకపోతే అతడు ప్రత్యక్షంగా కాకుండా, పరోక్షంగా ప్రచారం చేశాడు.
మెస్సికి వైన్ తాగడం అలవాటు. అందులో స్ప్రైట్ కూడా కలుపుకుంటాడు. ఇదే విషయాన్ని అతడు ఇటీవల తెలిపాడు. అతడు ఆ మాట అన్నాడో లేదో.. వెంటనే కోకా కోలా కంపెనీ ముఖచిత్రం మొత్తం మారిపోయింది. మెస్సి చెప్పిన ఆ మాటలు కోకా కోలా కు సిరులు కురిపించాయి. ఆ కంపెనీ షేర్లు భారీగా పెరిగిపోయాయి. కేవలం మూడు రోజుల్లోనే 12.9 బిలియన్ డాలర్ల సంపద పెరిగింది. ఇది ఇండియన్ కరెన్సీ లో చెప్పాలంటే అక్షరాల 1.16 లక్షల కోట్లు. 2021లో ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో కోకా కోలా కు ఉత్పత్తిని పక్కన పెట్టాడు. దీంతో ఆ కంపెనీ దాదాపు 48 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. అయితే ఇప్పుడు మెస్సీ వల్ల కోకా కోలా ఈ స్థాయిలో సంపదను సొంతం చేసుకుంది.
“మెస్సి ఒక మాట మాట్లాడాడు. అది కాస్త మా కంపెనీపై తీవ్రమైన ప్రభావం చూపించింది. స్ప్రైట్ ఉత్పత్తికి ప్రపంచ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు అతడు చెప్పిన మాటలతో ఆ డిమాండ్ మరింత పెరిగింది. ఇది మా కంపెనీ ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుందని” కోకా కోలా కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.