https://oktelugu.com/

IPL Mega Auction 2025 : హిట్ బ్యాటర్ కు కోల్ కతా జాక్ పాట్.. ఎంతకు కొనుగోలు చేసిందంటే..

ఐపీఎల్ 2025 సీజన్లో స్టార్ ఆటగాళ్ల మీద కోట్ల వర్షం కురుస్తోంది. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ సరికొత్త రికార్డు సెట్ చేయగా... దానికి కొనసాగింపుగా వెంకటేష్ అయ్యర్ మరో ఘనతను అందుకున్నాడు. కళ్ళు చెదిరే విధంగా జాక్ పాట్ కొట్టేశాడు.

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2024 8:52 pm
    Follow us on

    IPL Mega Auction 2025 : ఉత్సాహంగా సాగుతున్న వేలంలో రిషబ్ పంత్ ను లక్నో జట్టు ఏకంగా 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు అదే హైయెస్ట్ రికార్డ్ గా ఉంది. గత సీజన్లో కోల్ కతా జట్టు ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ కోసం ఏకంగా 24.75 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఆ రికార్డును రిషబ్ పంత్ బద్దలు కొట్టేశాడు. తన దరిదాపుల్లోకి మరో ఆటగాడిని రాకుండా చూసుకున్నాడు. ఏకంగా 27 కోట్లతో సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించాడు. ఇక గత సీజన్లో కోల్ కతా జట్టును విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు దక్కించుకున్నాడు. పంజాబ్ జట్టు అతనికోసం ఏకంగా భారీ ధరను కోట్ చేసి విజయం సాధించింది. హోరాహోరీ పోటీ మధ్య అతడిని దక్కించుకుంది. అయితే వీరిద్దరి రికార్డుకు కొనసాగింపుగా.. కోల్ కతా జట్టు ఆటగాడు వెంకటేష్ అయ్యర్ ఏకంగా 23.75 కోట్లు దక్కించుకున్నాడు. గత ఏడాది కోల్ కతా జట్టు విజేతగా నిలవడంలో వెంకటేష్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తను గట్టిగా నిలబడి విజయాన్ని అందించాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే ఈ యువ ఆటగాడు చూస్తుండగానే విధ్వంసాన్ని సృష్టిస్తాడు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయగల సామర్థ్యం ఇతడి సొంతం. అందువల్లే కోల్ కతా జట్టు యాజమాన్యం ఇతడిని రికార్డు ధరకు కొనుగోలు చేసింది. వాస్తవానికి ఇతడి బేస్ ప్రైస్ రెండు కోట్లు మాత్రమే . అయితే ఇతడిని దక్కించుకోవడం కోసం లక్నో, కోల్ కతా, బెంగళూరు జట్లు పోటీపడ్డాయి.

    ఐపీఎల్ కెరియర్లో

    వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ కెరియర్లో 137 స్ట్రైక్ రేట్ కొనసాగిస్తున్నాడు. ఏకంగా 1326 పరుగులు చేశాడు. కొంతకాలంగా వెంకటేశ్ అయ్యర్ కోల్ కతా జట్టు తరుపున ఆడుతున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడటంలో.. మెరుగైన భాగస్వామ్యాలు నిర్మించడంలో వెంకటేష్ అయ్యర్ దిట్ట. అందువల్లే అతడిని కోల్ కతా జట్టు భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ” కోల్ కతా యాజమాన్యం పకడ్బందీ వ్యూహాలను రచించింది.. వర్ధమాన ఆటగాళ్లకు విపరీతమైన అవకాశాలు కల్పిస్తోంది. రెట్టించిన డబ్బును కుమ్మరిస్తోంది. దీనివల్ల వచ్చే సీజన్లోనూ తమ జట్టు విజేతగా ఆవిర్భవించగలదని బలంగా నమ్ముతోంది. అందువల్లే ఆ జట్టు యాజమాన్యం వేలంలో ఉత్సాహంగా పాల్గొంటుంది. ఇప్పటికే హిట్ బ్యాటర్లను కొనుగోలు చేసిన ఆ జట్టు.. బౌలర్ల విషయంలోనూ అదే ధోరణి కొనసాగిస్తోంది.. ఇప్పటికైతే కోల్ కతా అంచనాలు బాగానే ఉన్నాయి.. చూడాలి మరి ఏం జరుగుతుందోనని” స్పోర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి.