Kohli – Rinku Singh : ఐపీఎల్ 17వ సీజన్లో వరుస ఓటములు ఎదురవుతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో విమర్శలు చవిచూస్తున్నప్పటికీ.. బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ తన శైలి మార్చుకోవడం లేదు. ఓటమి, గెలుపు ఇలా ఏ అంశాన్నైనా మైదానం వరకే పరిమితం చేస్తున్నాడు. వ్యక్తిగత సంబంధాలకు, ఆటను ముడి పెట్టడం లేదు. మైదానంలో కోపంగా ఉండే విరాట్ కోహ్లీ.. మైదానం వెలుపల తన చలాకితనాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కప్ గెలిచిన బెంగళూరు క్రికెటర్లను అభినందించాడు. కప్ గెలిచిన అనంతరం వీడియో కాల్ లో మాట్లాడాడు. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు అన్ బాక్స్ వేడుకలో శ్రేయాంక పాటిల్ తో సరదాగా మాట్లాడాడు. ఒక ఫోటో కూడా దిగాడు. అలాంటి విరాట్ కోహ్లీ శుక్రవారం కోల్ కతా జట్టుతో ఓటమి తర్వాత యువ క్రికెటర్ కు అద్భుతమైన బహుమతి అందించాడు.
బెంగళూరు వేదికగా కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమిపాలైంది. 20 ఓవర్లకు 182 పరుగులు చేసిన బెంగళూరు జట్టు.. కోల్ కతా జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు బెంగళూరు విధించిన 183 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 16.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. కోల్ కతా జట్టు విజయంలో సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ ముఖ్యపాత్ర పోషించారు
విరాట్ కోహ్లీ 83 పరుగులు చేసినప్పటికీ బెంగళూరు జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ హై వోల్టేజ్ లాగా సాగుతుందని అటు బెంగళూరు అభిమానులు, ఇటు కోల్ కతా అభిమానులు భావించారు. కానీ ఆటగాళ్లు సరదాగా మైదానంలో కదిలారు.. ఈ మ్యాచ్ ద్వారా గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ తమ 11 ఏళ్ల కోపతాపాలకు చెక్ పెట్టారు. మ్యాచ్ కు ముందు వారిద్దరూ మళ్లీ గొడవపడతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే నాటి గొడవకు వారిద్దరు స్వస్తి పలికారు. మ్యాచ్ లో బెంగళూరు ఓడిపోయినప్పటికీ ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రింకు సింగ్ బ్యాట్ ను ఆసక్తిగా పరిశీలించాడు. బ్యాట్లో ఏమైనా దాచావా అంటూ సరదాగా అడిగినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే విరాట్ కోహ్లీ రింకు సింగ్ బ్యాట్ ఎందుకు పరిశీలించాడో తర్వాత గాని అర్థం కాలేదు. ఎందుకంటే రింకు సింగ్ కు విరాట్ కోహ్లీ ప్రత్యేకమైన బహుమతి ఇచ్చేందుకు అలా చేసినట్టు తెలిసింది. ప్రత్యేకమైన బ్యాట్ ను బహుమతిగా ఇచ్చిన తర్వాత కోహ్లీ తనకు విలువైన సలహాలు ఇచ్చాడని రింకు సింగ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా ప్రకటించాడు. ఇదే విషయాన్ని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కూడా సామాజిక మాధ్యమాలలో పంచుకుంది. రింకు సింగ్ ఐపీఎల్ లో హార్డ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. తన ఆట తీరుతో టీమిండియాలోనూ చోటు సంపాదించుకున్నాడు.