
Team India’s test vice captain : క్రికెట్‌లో వరుస వైఫల్యాలతో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎస్.రాహుల్ తన పదవితోపాటు జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించే సమయంలో సెలెక్టర్లు జట్టు వైస్ కెప్టెన్‌గా ఎవరినీ ఎంపికచేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు బీసీసీఐ విమర్శలపాలవుతోంది. టీమిండియా మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైస్ కెప్టెన్ పదవికి మరో స్టార్ పేరును ప్రతిపాదించాడు. ఇది అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో అతడిని ట్రోల్ చేస్తున్నారు.
అశ్విన్ ఎందుకు వద్దు?
తన యూట్యూబ్ చానెల్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ సమస్య గురించి భజ్జీ మాట్లాడాడు. ఈ వీడియో లింక్‌ను తన ట్విట్టర్ ఖాతాలో కూడా అతను షేర్ చేశాడు. ఈ సమయంలో తన పోస్టులో చిన్న పొరపాటు చేశాడు. మూడో టెస్టులో కేఎల్.రాహుల్‌ను పక్కన పెట్టి శుభ్‌మన్ గిల్‌తో ఓపెనింగ్ చేయిస్తారా? అని భజ్జీ ప్రశ్నించాడు. వైస్ కెప్టెన్‌గా రవీంద్రజడేజాను ఎందుకు ఎంపిక చేయకూడదు అని పేర్కొన్నాడు. దీనిని ఇప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అశ్విన్‌ను ఎప్పుడూ తక్కువ చేయడానికే భజ్జీ ప్రయత్నిస్తుంటాడని క్రికెట్ అభిమానుల భావన. అందుకే భజ్జీని ట్రోల్ చేస్తున్నారు. ఆసీస్ సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఇలాగే జరిగింది.
అశ్విన్ అంటే కుళ్లు..
మాజీ లెజెండ్ వసీం జాఫర్.. సిరీస్ మొదలవలేదు కానీ ఆసీస్ బుర్రలో అప్పుడే అశ్విన్ చేరాడంటూ ట్వీట్ చేశాడు. అయితే వాళ్ల బుర్రలో ఉంది అశ్విన్ కాదని, స్పిన్‌కు సహకరించే పిచ్‌లు అని భజ్జీ కకామెంట్ చేశాడు. అప్పుడే అతన్ని నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. మళ్లీ ఇప్పుడు భజ్జీ చేసిన కామెంట్లపై అలాగే రియాక్ట్ అవుతున్నారు. ‘అశ్విన్ నీ కన్నా గొప్ప బౌలర్ అని నీకు కుళ్లు అంతే’ అంటూ భజ్జీపై మండిపడుతున్నారు. ‘అశ్విన్ మీద పడి ఎందుకంతలా ఏడుస్తావ్?’ అని తిట్టిపోస్తున్నారు.
వైస్ కెప్టెన్ ఎవరు?
అలాగే రెండు మ్యాచుల్లో రాణించిన రవీంద్ర జడేజాను టెస్టుల్లోనే కాదు, వన్డేల్లోనూ వైస్ కెప్టెన్ చేయాలన్నాడు. అలాగే తన పోస్టులో ‘వైస్ కెప్టెన్’ అని రాయడానికి బదులు పొరపాటున ‘వీసా కెప్టెన్’ అని రాసేశాడు. తన పొరపాటు గుర్తించిన అతను వెంటనే ఈ పోస్టును డిలీట్ చేసేశాడు. కానీ ఫ్యాన్స్ దృష్టి నుంచి ఇది తప్పించుకోలేకపోయింది. దీనిపై ఫ్యాన్స్ వైల్డ్‌గా రియాక్ట్ అయ్యారు. మరి అశ్విన్‌ను ఏం చేద్దాం? అని కొందరు అడుగుతున్నారు. మరికొందరేమో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా జడేజా విఫలమయ్యాడు. అతనిపై ఈ పని భారం పెడితే అతని ఆటతీరు కూడా దెబ్బతింటుందని భజ్జీకి క్లాస్ పీకారు. ఇంకొందరు ‘ఈ వీసా కెప్టెన్ ఎవరు?’ అని జోకులు వేస్తున్నారు.
వైస్ కెప్టెన్సీ రేసులో ఆ ఇద్దరు..
ఇక పోతే భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్సీ రేసులో ఇద్దరు క్రికెటర్లు ఉన్నట్లు మాజీ ప్లేయర్స్‌తోపాటు, క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టెస్ట్ క్రికెట్ స్పెషలిస్టుగా ఉన్న పుజారాతోపాటు శ్రేయస్ అయ్యర్ ఈ రేసులో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 35 ఏళ్ల పుజారా వంద టెస్టులు ఆడాడు. బ్యాటింగ్ స్పెషలిస్టు అయిన పుజారా కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. దీంతో అతడినే ఎంపిక చేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక శ్రేయస్ కేవలం 8 టెస్టు మ్యాచ్‌లే ఆడాడు. అయితే అండర్ – 19 జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. దీంతో అతడిని కూడా వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయవచ్చని మరికొంతమంది పేర్కొంటున్నారు.
మొత్తంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆస్ట్రేలియా మ్యాచ్‌లకు వైస్ కెప్టెన్‌ను ఎంపిక చేయకపోవడం, భజ్జీ కామెంట్స్ నేపథ్యంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.