Team India:ప్రపంచకప్ టీ20లో టీమిండియా ఘోర పరాజయంతో ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ ప్రపంచకప్ టీ20 ముగియగానే భారత్ లో న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ జరుగబోతోంది. ఇప్పటికే తీరిక లేని షెడ్యూల్ కారణంగా టీమిండియా ఆటగాళ్లు అలిసిపోయారు. ఐపీఎల్ లో ఆడి ప్రపంచకప్ టీ20లో తేలిపోయారు. అందుకే బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా సీనియర్లు అందరినీ మూడు టీ20 సిరీస్ లకు పక్కనపెట్టే ఆలోచనలో ఉన్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ లో సీనియర్లకు విశ్రాంతిని పూర్తి కొత్త యువ జట్టును బరిలోకి దింపడానికి టీమిండియా రెడీ అయ్యింది. న్యూజిలాండ్ తో జరుగబోయే టీ20 సిరీస్ లో భారత్ కు కేఎల్ రాహుల్ ను కెప్టెన్ చేయబోతున్నట్టు తెలిసింది. రెండు టెస్టులకు కూడా కొత్త జట్టును ప్రకటించాలని యోచిస్తున్నారు.
కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో పూర్తిగా యువ జట్టును తీసుకోనున్నారు. ఫృథ్వీ షా, రుతురాజ్ గైక్వైడ్, మయాంక్ అగర్వాల్, చాహల్, శిఖర్ ధావన్ లు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంది. హర్షల్ పటేల్, చేతన్ సకారియా, అర్ష్ దీప్, సిరాజ్, ఆవేష్ ఖాన్ లను బౌలర్లుగా తీసుకోబోతున్నారు.
విరాట్ కోహ్లీ ఈ ప్రపంచకప్ టీ20తో రిటైర్ మెంట్ ప్రకటించాడు. దీంతో భారత కొత్త టీ20 జట్టుకు కెప్టెన్ కు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నా కూడా భవిష్యత్ అవసరాల కోసం కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ అప్పగించేందుకు బీసీసీఐ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. కేఎల్ రాహుల్ కనుక ఈ సిరీస్ లో సక్సెస్ అయితే రోహిత్ శర్మను పక్కనపెట్టి పూర్తి స్థాయి కెప్టెన్సీని రాహుల్ కే అప్పగించేందుకు బీసీసీఐ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.